Visuchika Nivarana Mantra (Yoga Vasistham) – విషూచికా మంత్ర కథనం (యోగవాసిష్ఠం)


శ్రీ వసిష్ఠ ఉవాచ |
అథ వర్షసహస్రేణ తాం పితామహ ఆయయౌ |
దారుణం హి తపః సిద్ధ్యై విషాగ్నిరపి శీతలః || ౧ ||

అర్థం – శ్రీవసిష్ఠుడు పలికెను: (కర్కటి తపస్సు చేయు) వేయి సంవత్సరముల తరువాత పితామహుడు (బ్రహ్మగారు), దారుణమగు తపస్సును సిద్ధింపజేయుటకు విషాగ్నిని చల్లబరచు శీతలము వలె వచ్చెను.

మనసైవ ప్రణమ్యైనం సా తథైవ స్థితా సతీ |
కో వరః క్షుచ్ఛమాయాఽలమితి చింతాన్వితాఽభవత్ || ౨ ||

అర్థం – (బ్రహ్మగారికి) మనస్సులోనే ప్రణామము చేసి తన స్థితినుంచి కదలక, ఏమి వరము కోరుకోవలెనోయని చింతన చేయుచుండెను.

ఆ స్మృతం ప్రార్థయిష్యేఽహం వరమేకమిమం విభుమ్ |
అనాయసీ చాయసీ చ స్యామహం జీవసూచికా || ౩ ||

అర్థం – విభునకు ప్రార్థనచేసి కోరుకోవలసిన వరము గుర్తుకు వచ్చినది. మృదువుగా కాక ఇనుమువలె గట్టిగా, జీవులలోనికి చొచ్చుకుపోగల సూదిమొన వలె అయ్యెదను అని అనుకొనెను.

అస్యోక్త్యా ద్వివిధా సూచిర్భూత్వా లక్ష్యా విశామ్యహమ్ |
ప్రాణినాం సహ సర్వేషాం హృదయం సురభిర్యథా || ౪ ||

అర్థం – “నేను సూచి (సూదిమొన) రూపముతో కనిపించకుండా ప్రాణులన్నిటిలోని హృదయములోనికి, (నాసికములోనికి వెళ్ళు పుష్ప) సౌరభము వలె, చొచ్చుకుపోయెదను”.

యథాభిమతమేతేన గ్రసేయం సకలం జగత్ |
క్రమేణ క్షుద్వినాశాయ క్షుద్వినాశః పరం సుఖమ్ || ౫ ||

అర్థం – “నా అభిమతము మేర ఈ సకల జగత్తును (ప్రాణులను) గ్రసించి, ఆ క్రమములో నా ఆకలిని తీర్చుకొని, ఆకలి తీరినది కనుక పరమసుఖమును పొందెదను.”

ఇతి సంచింతయంతీం తామువాచ కమలాలయః |
అన్యాదృశ్యాస్తథా దృష్ట్వా స్తనితాభ్రరవోపమమ్ || ౬ ||

అర్థం – ఇలా (కర్కటి) ఆలోచనచేయుచూ ఉండగా, కమలాలయుడు (కమలమునందు ఉండువాడు) ఆమె చెడు ఉద్దేశ్యములను పసిగట్టి, ఉరుముతున్న మబ్బులవంటి కంఠముతో ఇట్లు పలికెను.

బ్రహ్మోవాచ |
పుత్రి కర్కటికే రక్షఃకులశైలాభ్రమాలికే |
ఉత్తిష్ఠ త్వం తు తుష్టోఽస్మి గృహాణాభిమతం వరమ్ || ౭ ||

అర్థం – బ్రహ్మదేవుడు పలికెను : పుత్రీ కర్కటీ ! రాక్షసకుల పర్వతము పైనున్న మేఘము వంటి నీవు, పైకి లే. (నీ తపముచే నేను) సంతుష్టుడనైతిని. నీకు కావలసిన వరము కోరుకొనుము.

కర్కట్యువాచ |
భగవన్ భూతభవ్యేశ స్యామహం జీవసూచికా |
అనాయసీ చాయసీ చ విధేఽర్పయసి చేద్వరమ్ || ౮ ||

అర్థం – కర్కటి పలికెను : భూత భవిష్యత్తులను శాసించగల భగవంతుడా, నేను జీవసూచిగా మారునటుల, మృదువుగా కాక ఇనుమువలె కఠినముగా అగునటుల వరమును ఇవ్వుము.

శ్రీవసిష్ఠ ఉవాచ |
ఏవమస్త్వితి తాముక్త్వా పునరాహ పితామహః |
సూచికా సోపసర్గా త్వం భవిష్యసి విషూచికా || ౯ ||

అర్థం – శ్రీవసిష్ఠుడు పలికెను : “అటులనే అగుగాక” అని పితామహుడు పలికుచూ, “సూచికా రూపములో బాధపెట్టుచూ నీవు విషూచికా అయ్యెదవు”.

సూక్ష్మయా మాయయా సర్వలోకహింసాం కరిష్యసి |
దుర్భోజనా దురారంభా మూర్ఖా దుఃస్థితయశ్చ యే || ౧౦ ||

అర్థం – “సూక్ష్మముగా మాయవలె సర్వలోకములను హింస చేయుము. ముఖ్యముగా, చెడు భోజనములు చేయువారు, చెడుపనులను ఆరంభము చేయువారలను, మూర్ఖులను మరియు దుస్థితులయందు ఉన్నవారిని హింసించుము.”

దుర్దేశవాసినో దుష్టాస్తేషాం హింసాం కరిష్యసి |
ప్రవిశ్య హృదయం ప్రాణైః పద్మప్లీహాది బాధనాత్ || ౧౧ ||

అర్థం – “దుష్టమైన ప్రదేశములలో ఉన్నవారిని, దుష్టులను నీవు హింసింపుము. ప్రాణుల హృదయమునందు ప్రవేశించి ప్లీహాది బాధలను కలించుము.”

వాతలేఖాత్మికా వ్యాధిర్భవిష్యసి విషూచికా |
సగుణం విగుణం చైవ జనమాసాదయిష్యసి || ౧౨ ||

అర్థం – “వాతాది వ్యాధులను కలిగించు విషూచికా, మంచి గుణములు మరియు చెడు గుణములు కలిగిన జనులపైకూడా ప్రభావము చూపుము.”

గుణాన్వితచికిత్సార్థం మంత్రోఽయం తు మయోచ్యతే |

అర్థం – “నీ గుణములచే ప్రభావితమైన వారి చికిత్స కొరకు ఈ మంత్రమును నేను చెప్పెదను”.

బ్రహ్మోవాచ |
హిమద్రేరుత్తరే పార్శ్వే కర్కటీ నామ రాక్షసీ || ౧౩ ||
విషూచికాఽభిధానా సా నామ్నాప్యన్యాయబాధికా |

అర్థం – బ్రహ్మదేవుడు పలికెను : హిమాద్రి యొక్క ఉత్తరభాగములో ఉండు కర్కటీ అనే పేరు గల రాక్షసియొక్క విషూచికా అని పిలవబడే అన్యాయ బాధ (నుండి ముక్తికొరకు ఈ మంత్రము)

తస్యా మంత్రః |
ఓం హ్రీం హ్రాం రీం రాం విష్ణుశక్తయే నమః |
ఓం నమో భగవతి విష్ణుశక్తిమేనాం ఓం హర హర నయ నయ పచ పచ మథ మథ ఉత్సాదయ ఉత్సాదయ దూరే కురు స్వాహా హిమవంతం గచ్ఛ జీవ సః సః సః చంద్రమండల గతోఽసి స్వాహా |

అర్థం – విష్ణువు యొక్క హ్రీం, హ్రాం, రీం, రాం అను శక్తులను నమస్కరిస్తున్నాను. ఆ విష్ణు శక్తులు (విషూచికా ప్రభావమును) హరించి, తీసుకువెళ్ళి, కాల్చి, చిలికి, నాశనము చేయుచూ దూరము చేసి, హిమలయములలోకి పంపుతూ (ఆ జీవసూచికను) చంద్రమండలములోకి పంపుగాక.

ఇతి మంత్రీ మహామంత్రం న్యస్య వామకరోదరే |
మార్జయేదాతురాకారం తేన హస్తేన సంయుతః || ౧౪ ||

అర్థం – ఈ మహామంత్రమును మంత్రి (మంత్రసిద్ధి కలిగినవారు) యొక్క ఎడమ అరచేతిలో న్యాసము చేసి, ఆ హస్తముతో బాధకలుగు ప్రదేశములో మర్దన చేయవలెను.

హిమశైలాభిముఖ్యేన విద్రుతాం తాం విచింతయేత్ |
కర్కటీ కర్కశాక్రందాం మంత్రముద్గరమర్దితామ్ || ౧౫ ||

అర్థం – హిమశైలాభిముఖమైన (విషూచికా) బాధ తగ్గినట్టు, కర్కటియొక్క కర్కశమైన ఆక్రందనలు, ఈ మంత్రము అనే సమ్మెట క్రింద నలిగినట్లు భావించవలెను.

ఆతురం చింతయేచ్చంద్రే రసాయనహృదిస్థితమ్ |
అజరామరణం యుక్తం ముక్తం సర్వాధివిభ్రమైః || ౧౬ ||

అర్థం – రోగి కూడా చంద్రుని యందు ఉన్న రసాయనము (ఔషధము) తన హృదయమునందు ఉన్నట్టు, ముసలితనము మరణము లేని ముక్తిని పొందినట్టు భావించవలెను.

సాధకో హి శుచిర్భూత్వా స్వాచాంతః సుసమాహితః |
క్రమేణానేన సకలాం ప్రోచ్ఛినత్తి విషూచికామ్ || ౧౭ ||

అర్థం – సాధకుడు శుచిగా, సమాహిత మనస్సుతో సాధన చేసిన, క్రమముగా విషూచికా బాధను పూర్తిగా నిర్మూలించగలడు.

ఇతి గగనగతస్త్రిలోకనాథః
గగనగసిద్ధగృహీత సిద్ధమంత్రః |
గత ఉపగతశక్రవంద్యమానో
నిజపురమక్షయమాయముజ్జ్వలశ్రీః || ౧౮ ||

అర్థం – ఇటుల ఉపదేశించి ఆకాశమార్గమున అంతర్ధానమైన త్రిలోకనాథుడు, ఆకాశమార్గమునందు ఉన్న సిద్ధులు కూడా ఈ సిద్ధమంత్రమును తీసుకొనగా, శక్రుడు (ఇంద్రుడు) వందనము చేయుచుండగా, అక్షయము, ఉజ్జ్వలము అయిన తన నిజపురమునకు యేగెను.

ఇత్యార్షే శ్రీవాసిష్ఠమహారామాయణే వాల్మీకీయే ఉత్పత్తిప్రకరణే విషూచికామంత్ర కథనం నామ ఏకోనసప్తతితమస్సర్గః |

(ఈ అర్థము శ్రీ మండా కృష్ణశ్రీకాంత శర్మకు స్ఫురించి వ్రాయబడినది.)

శ్రీ ధన్వంతరీ మహామంత్రం , నవగ్రహ ప్రార్థనా చూ. >>


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed