Sri Anjaneya Dandakam – శ్రీ ఆంజనేయ దండకం


[గమనిక: ఈ స్తోత్రము “శ్రీరామ స్తోత్రనిధి” పుస్తకములో కూడా ఉన్నది. Click here to buy.]

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేఽహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రంబు నీ నామసంకీర్తనల్ జేసి నీ రూపు వర్ణించి నీమీద నే దండకం బొక్కటింజేయ నూహించి నీ మూర్తినిం గాంచి నీ సుందరం బెంచి నీ దాసదాసుండనై రామభక్తుండనై నిన్ను నే గొల్చెదన్ నీ కటాక్షంబునన్ జూచితే వేడుకల్ జేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయా దేవ నిన్నెంచ నేనెంతవాడన్ దయాశాలివై చూచితే దాతవై బ్రోచితే దగ్గరన్ నిల్చితే తొల్లి సుగ్రీవుకున్ మంత్రివై స్వామి కార్యార్థమై యేగి శ్రీరామ సౌమిత్రులం జూచి వారిన్విచారించి సర్వేశు పూజించి యబ్బానుజున్ బంటు గావించి యవ్వాలినిన్ జంపి కాకుత్స్థతిలకున్ దయాదృష్టి వీక్షించి కిష్కింధకేతెంచి శ్రీరామ కార్యార్థమై లంక కేతెంచియున్ లంకిణిన్ జంపియున్ లంకయున్ గాల్చియున్ భూమిజన్ జూచి యానందముప్పొంగ యాయుంగరంబిచ్చి యారత్నమున్ దెచ్చి శ్రీరామునకున్నిచ్చి సంతోషునిన్ జేసి సుగ్రీవుడా యంగదా జాంబవంతాది వీరాదులన్ గూడి యాసేతువున్ దాటి వానరానీకముల్ పెన్మూకలై దైత్యులన్ ద్రుంచగా రావణుండంత కాలాగ్ని రూపోగ్రుడై కోరి బ్రహ్మాండమైనట్టి యా శక్తినిన్ వేసి యా లక్షణున్ మూర్ఛనొందింపగా నప్పుడే నీవు సంజీవినిన్ దెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా కుంభకర్ణాదులన్వీరులన్ బోరి శ్రీరామ బాణాగ్ని వారందరిన్ రావణున్ జంపగా నంత లోకంబులానందమై యుండ నవ్వేళలందున్ విభీషణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవినిన్ దెచ్చి శ్రీరాముతోజేర్చి అయ్యోధ్యకున్ వచ్చి పట్టాభిషేకంబు సంరంభమైయున్న నీకన్న నాకెవ్వరున్ గూర్మి లేరంచు మన్నించినన్ శ్రీరామభక్తి ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీ నామకీర్తనల్ జేసితే పాపముల్బాయునే భయములున్ దీరునే భాగ్యముల్ గల్గునే సకల సామ్రాజ్యముల్ సకల సంపత్తులున్ గల్గునే వానరాకార యో భక్తమందార యో పుణ్యసంచార యో ధీర యో వీర నీవే సమస్తంబు నీవే మహాఫలముగా వెలసి యా తారక బ్రహ్మమంత్రంబు సంధానమున్ జేయుచున్ స్థిరముగా వజ్రదేహంబునున్ దాల్చి శ్రీరామ శ్రీరామ యంచున్ మనఃపూతమైన యెప్పుడున్ తప్పకన్ తలతు నా జిహ్వయందుండియున్ దీర్ఘదేహంబు త్రైలోక్య సంచారివై రామ నామాంకితధ్యానివై బ్రహ్మవై బ్రహ్మతేజంబునన్ రౌద్ర నీ జ్వాల కల్లోల హా వీరహనుమంత ఓంకార శబ్దంబులన్ క్రూరసర్వగ్రహానీకమున్ భూత ప్రేతంబులన్ పిశాచ శాకినీ ఢాకినీ మోహినీ గాలిదయ్యంబులన్ నీదు వాలంబునన్ జుట్టి నేలన్ బడన్ గొట్టి నీముష్టి ఘాతంబులన్ బాహుదండంబులన్ రోమఖండంబులన్ ద్రుంచి కాలాగ్నిరుద్రుండవై బ్రహ్మప్రభాభాసితంబైన నీదివ్య తేజంబునున్ జూచి రారోరి నా ముద్దు నరసింహ యనుచున్ దయాదృష్టి వీక్షించి నన్నేలు నాస్వామి యో ఆంజనేయా నమస్తే సదా బ్రహ్మచారీ నమో వాయుపుత్రా నమస్తే నమస్తే నమః ||


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ రామ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ హనుమాన్ స్తోత్రాలు పఠించండి.


గమనిక: రాబోయే ఆషాఢ నవరాత్రుల సందర్భంగా "శ్రీ వారాహీ స్తోత్రనిధి" పుస్తకము అందుబాటులో ఉంది. Click here to buy.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

15 thoughts on “Sri Anjaneya Dandakam – శ్రీ ఆంజనేయ దండకం

  1. భార్యా భర్తల మధ్య గొడవలు పెళ్ళి అయినప్పటి (16-05-2019 న వివాహం అయ్యింది) నుంచి భార్య పరపురుష వ్యామోహం వల్ల. దయచేసి భార్యాభర్తల అన్యోన్యతకు ఏమైనా దోషనివారణ తెలియజేయండి.

స్పందించండి

error: Not allowed