Read in తెలుగు / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ లలితా స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]
లలితామాతా శంభుప్రియా జగతికి మూలం నీవమ్మా
శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికీ ఆధారం || ౧ ||
హేరంబునికి మాతవుగా హరిహరాదులు సేవింప
చండునిముండుని సంహారం చాముండేశ్వరి అవతారం || ౨ ||
పద్మరేకుల కాంతులలో బాలాత్రిపురసుందరిగా
హంసవాహనారూఢిణిగా వేదమాతవై వచ్చితివి || ౩ ||
శ్వేతవస్త్రము ధరియించి అక్షరమాలను పట్టుకొని
భక్తిమార్గము చూపితివి జ్ఞానజ్యోతిని నింపితివి || ౪ ||
నిత్య అన్నదానేశ్వరిగా కాశీపురమున కొలువుండ
ఆదిబిక్షువై వచ్చాడు సాక్షాదాపరమేశ్వరుడు || ౫ ||
కదంబవన సంచారిణిగా కామేశ్వరుని కళత్రముగా
కామితార్థ ప్రదాయినిగా కంచి కామాక్షివైనావు || ౬ ||
శ్రీచక్రరాజ నిలయినిగా శ్రీమత్ త్రిపురసుందరిగా
సిరి సంపదలు ఇవ్వమ్మా శ్రీమహాలక్ష్మిగా రావమ్మా || ౭ ||
మణిద్వీపమున కొలువుండి మహాకాళి అవతారములో
మహిషాసురుని చంపితివి ముల్లోకాలను ఏలితివి || ౮ ||
పసిడి వెన్నెల కాంతులలో పట్టువస్త్రపుధారణలో
పారిజాతపు మాలలలో పార్వతి దేవిగా వచ్చితివి || ౯ ||
రక్తవస్త్రము ధరియించి రణరంగమున ప్రవేశించి
రక్తబీజుని హతమార్చి రమ్యకపర్దినివైనావు || ౧౦ ||
కార్తికేయునికి మాతవుగా కాత్యాయినిగా కరుణించి
కలియుగమంతా కాపాడ కనకదుర్గవై వెలిసితివి || ౧౧ ||
రామలింగేశ్వరు రాణివిగా రవికుల సోముని రమణివిగా
రమా వాణి సేవితగా రాజరాజేశ్వరివైనావు || ౧౨ ||
ఖడ్గం శూలం ధరియించి పాశుపతాస్త్రము చేబూని
శుంభ నిశుంభుల దునుమాడి వచ్చింది శ్రీశ్యామలగా || ౧౩ ||
మహామంత్రాధిదేవతగా లలితాత్రిపురసుందరిగా
దరిద్ర బాధలు తొలిగించి మహదానందము కలిగించే || ౧౪ ||
అర్తత్రాణ పరాయణివే అద్వైతామృత వర్షిణివే
ఆదిశంకర పూజితవే అపర్ణాదేవి రావమ్మా || ౧౫ ||
విష్ణు పాదమున జనియించి గంగావతారము ఎత్తితివి
భాగీరథుడు నిను కొలువ భూలోకానికి వచ్చితివి || ౧౬ ||
ఆశుతోషుని మెప్పించి అర్ధశరీరం దాల్చితివి
ఆదిప్రకృతి రూపిణిగా దర్శనమిచ్చెను జగదంబా || ౧౭ ||
దక్షుని ఇంట జనియించి సతీదేవిగా చాలించి
అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చెను జగదంబా || ౧౮ ||
శంఖు చక్రము ధరియించి రాక్షస సంహారమును చేసి
లోకరక్షణ చేసావు భక్తుల మదిలో నిలిచావు || ౧౯ ||
పరాభట్టారిక దేవతగా పరమశాంత స్వరూపిణిగా
చిరునవ్వులను చిందిస్తూ చెఱుకు గడను ధరయించితివి || ౨౦ ||
పంచదశాక్షరి మంత్రాధితగా పరమేశ్వర పరమేశ్వరితో
ప్రమథగణములు కొలువుండ కైలాసంబే పులకించే || ౨౧ ||
సురులు అసురులు అందరును శిరసును వంచి మ్రొక్కంగా
మాణిక్యాల కాంతులతో నీ పాదములు మెరిసినవి || ౨౨ ||
మూలాధార చక్రములో యోగినులకు ఆదీశ్వరియై
అంకుశాయుధ ధారిణిగా భాసిల్లెను శ్రీ జగదంబా || ౨౩ ||
సర్వదేవతల శక్తులచే సత్య స్వరూపిణి రూపొంది
శంఖనాదము చేసితివి సింహవాహినిగా వచ్చితివి || ౨౪ ||
మహామేరువు నిలయినివి మందార కుసుమ మాలలతో
మునులందరు నిను కొలవంగ మోక్షమార్గము చూపితివి || ౨౫ ||
చిదంబరేశ్వరి నీ లీల చిద్విలాసమే నీ సృష్టి
చిద్రూపీ పరదేవతగా చిరునవ్వులను చిందించే || ౨౬ ||
అంబా శాంభవి అవతారం అమృతపానం నీ నామం
అద్భుతమైనది నీ మహిమ అతిసుందరము నీ రూపం || ౨౭ ||
అమ్మలగన్న అమ్మవుగా ముగ్గురమ్మలకు మూలముగా
జ్ఞానప్రసూనా రావమ్మా జ్ఞానమునందరికివ్వమ్మా || ౨౮ ||
నిష్ఠతో నిన్నే కొలిచెదము నీ పూజలనే చేసెదము
కష్టములన్నీ కడతేర్చి కనికరముతో మము కాపాడు || ౨౯ ||
రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప
అభయహస్తము చూపితివి అవతారములు దాల్చితివి || ౩౦ ||
అరుణారుణపు కాంతులలో అగ్ని వర్ణపు జ్వాలలలో
అసురులనందరి దునుమాడి అపరాజితవై వచ్చితివి || ౩౧ ||
గిరిరాజునికి పుత్రికగా నందనందుని సోదరిగా
భూలోకానికి వచ్చితివి భక్తుల కోర్కెలు తీర్చితివి || ౩౨ ||
పరమేశ్వరునికి ప్రియసతిగా జగమంతటికీ మాతవుగా
అందరి సేవలు అందుకొని అంతట నీవే నిండితివి || ౩౩ ||
కరుణించమ్మా లలితమ్మా కాపాడమ్మా దుర్గమ్మా
దర్శనమియ్యగ రావమ్మా భక్తుల కష్టం తీర్చమ్మా || ౩౪ ||
ఏ విధముగా నిను కొలిచినను ఏ పేరున నిను పిలిచినను
మాతృహృదయవై దయచూపు కరుణామూర్తిగా కాపాడు || ౩౫ ||
మల్లెలు మొల్లలు తెచ్చితిమి మనసును నీకే ఇచ్చితిమి
మగువలమంతా చేరితిమి నీ పారాయణ చేసితిమి || ౩౬ ||
త్రిమాతృరూపా లలితమ్మా సృష్టి స్థితి లయకారిణివి
నీ నామములు ఎన్నెన్నో లెక్కించుట మా తరమవునా || ౩౭ ||
ఆశ్రితులందరు రారండి అమ్మరూపము చూడండి
అమ్మకు నీరాజనమిచ్చి అమ్మ దీవెన పొందుదము || ౩౮ ||
సదాచార సంపన్నవుగా సామగాన ప్రియలోలినివి
సదాశివ కుటుంబినివి సౌభాగ్యమిచ్చే దేవతవు || ౩౯ ||
మంగళగౌరీ రూపమును మనసుల నిండా నింపండి
మహాదేవికి మనమంతా మంగళ హారతులిద్దాము || ౪౦ ||
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ లలితా స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ లలితా స్తోత్రాలు చూడండి. మరిన్ని దేవీ స్తోత్రాలు చూడండి.
గమనిక (15-May) : "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" ప్రింటింగు పూర్తి అయినది. కొనుగోలు చేయుటకు ఈ లింకు క్లిక్ చేయండి - Click here to buy.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.
t q