Lopamudra Kruta Sri Lakshmi Stotram (with Telugu Meaning) – శ్రీ లక్ష్మీ స్తోత్రం (లోపాముద్రా కృతం)



[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ లక్ష్మీ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో లో కూడా ఉన్నది.]

// శ్లోకాలు – తాత్పర్యం //

మాతర్నమామి కమలే పద్మాఽఽయతసులోచనే |
శ్రీవిష్ణుహృత్కమలస్థే విశ్వమాతర్నమోఽస్తు తే || ౧ ||

అమ్మా! కమలా! పద్మము వలె విశాలమైన అందమైన కన్నులు గలదానా (పద్మాఽఽయతసులోచనే), నీకు నమస్కరిస్తున్నాను. శ్రీవిష్ణుమూర్తి హృదయకమలమున నివసించే ఓ విశ్వమాతా! నీకు వందనము.

క్షీరసాగరసత్పుత్రి పద్మగర్భాభసుందరి |
లక్ష్మి ప్రసీద సతతం విశ్వమాతర్నమోఽస్తు తే || ౨ ||

క్షీరసాగరము యొక్క పుత్రికా! పద్మ గర్భము వలె అత్యంత సుందరమైన కాంతి గలదానా! ఓ లక్ష్మీ! నాపై ఎల్లప్పుడూ ప్రసన్నతను చూపుము. ఓ విశ్వమాతా! నీకు నమస్కారము.

మహేంద్రసదనే త్వం శ్రీః రుక్మిణీ కృష్ణభామినీ |
చంద్రే జ్యోత్స్నా ప్రభా సూర్యే విశ్వమాతర్నమోఽస్తు తే || ౩ ||

నీవు దేవేంద్రుని భవనమున ఐశ్వర్య లక్ష్మివి (శ్రీః), కృష్ణుని ప్రియభార్యవైన రుక్మిణివి. చంద్రునిలో వెన్నెలవు (జ్యోత్స్నా), సూర్యునిలో కాంతివి (ప్రభా). ఓ విశ్వమాతా! నీకు నమస్కారము.

స్మితాననే జగద్ధాత్రి శరణ్యే సుఖవర్ధిని |
జాతవేదసి దహనే విశ్వమాతర్నమోఽస్తు తే || ౪ ||

చిరునవ్వు చిందే ముఖము గలదానా! జగత్తును రక్షించే తల్లివి, శరణు కోరదగినదానివి మరియు సుఖాన్ని వృద్ధి చేసేదానా! అగ్నిలో దాహక శక్తివి నీవే. ఓ విశ్వమాతా! నీకు వందనము.

బ్రహ్మాణి త్వం సర్జనాఽసి విష్ణౌ త్వం పోషికా సదా |
శివే సంహారికా శక్తిర్విశ్వమాతర్నమోఽస్తు తే || ౫ ||

బ్రహ్మదేవునిలో సృష్టి శక్తివి (సర్జనా), విష్ణువులో పోషణ శక్తివి (పోషికా) మరియు శివునిలో సంహార శక్తివి నీవే. ఓ విశ్వమాతా! నీకు నమస్కారము.

త్వయా శూరో గుణీ విజ్ఞో ధన్యో మాన్యః కులీనకః |
కలాశీలకలాపాఢ్యో విశ్వమాతర్నమోఽస్తు తే || ౬ ||

నీ అనుగ్రహం కలిగితేనే మానవుడు శూరుడు, గుణవంతుడు, విద్వాంసుడు, ధన్యుడు, పూజింపదగినవాడు మరియు ఉత్తమ కులంలో జన్మించినవాడు అవుతాడు. కళలతో, శీలముతో కూడిన సమూహం (ఐశ్వర్యం) నీ వల్లనే లభిస్తుంది. ఓ విశ్వమాతా! నీకు నమస్కారము.

త్వయా గజస్తురంగశ్చ స్త్రైణస్తృణం సరః సదః |
దేవో గృహం కణః శ్రేష్ఠా విశ్వమాతర్నమోఽస్తు తే || ౭ ||

నీ కటాక్షము సోకినప్పుడే ఏనుగులు, గుర్రాలు, స్త్రీజనము, తృణము, సరస్సులు, సభలు, దేవతలు, గృహములు మరియు ధాన్యపు గింజలు సైతం శ్రేష్ఠతను, వైభవాన్ని పొందుతాయి. ఓ విశ్వమాతా! నీకు నమస్కారము.

త్వయా పక్షీ పశుః శయ్యా రత్నం పృథ్వీ నరో వధూః |
శ్రేష్ఠాః శుద్ధా మహాలక్ష్మి విశ్వమాతర్నమోఽస్తు తే || ౮ ||

మహాలక్ష్మీ! నీ కృప వల్లనే పక్షులు, పశువులు, శయ్యలు (శయనాసనాలు), రత్నములు, పృథ్వీ (భూమి), నరులు మరియు వధువులు (స్త్రీలు) పరిశుద్ధమైనవిగా, శ్రేష్ఠమైనవిగా భాసిస్తాయి. ఓ విశ్వమాతా! నీకు నమస్కారము.

లక్ష్మి శ్రీ కమలే పద్మే రమే పద్మోద్భవే సతి |
అబ్ధిజే విష్ణుపత్ని త్వం ప్రసీద సతతం ప్రియే || ౯ ||

ఓ లక్ష్మీ! శ్రీ! కమలా! పద్మా! రమా! పద్మోద్భవా (పద్మము నుండి పుట్టినదానా)! సతీ! సముద్ర పుత్రికా! విష్ణుపత్నీ! ఓ ప్రియమైన తల్లి! నాపై సదా ప్రసన్నతను చూపుము.

ఇతి శ్రీలక్ష్మీనారాయణసంహితాయాం లోపాముద్రా కృత శ్రీ లక్ష్మీ స్తోత్రమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ లక్ష్మీ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని శ్రీ లక్ష్మీ స్తోత్రాలు చూడండి.


మా ప్రచురణ: "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి (తాత్పర్య సహితం)" ప్రింటింగు పూర్తి అయి కొనుగోలుకు సిద్ధంగా ఉంది.

స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Support this Dharma Karya : If you find value in the Stotranidhi collection, please consider supporting this work. You can make a contribution through these links - PhonePe/GooglePay/BHIM (within India) or Paypal (outside India)

Buy Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".

విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.

Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed