Sri Shanmukha Stotram (with Telugu Meaning) – శ్రీ షణ్ముఖ స్తోత్రం



[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.]

(ఈ శ్లోకాలు ముఖ్యంగా తిరుచెందూర్ (సింధుతీరము) క్షేత్రంలో వెలసిన సుబ్రహ్మణ్య స్వామిని ఉద్దేశించి రచించినవి. సముద్ర తీరాన కొలువై ఉండి, భక్తుల ఆర్తిని తీర్చే షణ్ముఖుడి దివ్య మంగళ స్వరూపాన్ని, ఆయన వైభవాన్ని ఈ స్తోత్రం కొనియాడుతుంది.)

నారదాదిదేవయోగిబృందహృన్నికేతనం
బర్హివర్యవాహమిందుశేఖరేష్టనందనమ్ |
భక్తలోకరోగదుఃఖపాపసంఘభంజనం
భావయామి సింధుతీరవాసినం షడాననమ్ || ౧ ||

నారదుడు మొదలైన దేవయోగుల సమూహము యొక్క హృదయములే నివాసముగా కలవాడు, శ్రేష్ఠమైన నెమలిని వాహనముగా కలవాడు, చంద్రుడిని శిరస్సున ధరించిన శివునికి ప్రియమైన పుత్రుడు, భక్తుల యొక్క రోగములను, దుఃఖములను మరియు పాపముల సమూహమును నశింపజేయువాడు, సముద్ర తీరమున నివసించువాడైన ఆ షణ్ముఖుడిని ధ్యానిస్తున్నాను.

తారకారీమింద్రముఖ్యదేవబృందవందితం
చంద్రచందనాది శీతలాంకమాత్మభావితమ్ |
యక్షసిద్ధకిన్నరాదిముఖ్యదివ్యపూజితం
భావయామి సింధుతీరవాసినం షడాననమ్ || ౨ ||

తారకాసురుని శత్రువు (సంహారకుడు), ఇంద్రుడు మొదలైన దేవతా సమూహముచే నమస్కరించబడినవాడు, చంద్రుడు మరియు చందనము మొదలైన వాటి కంటే చల్లనైన ఒడి (ఆశ్రయము) కలవాడు, తనలో తాను రమించు ఆత్మస్వరూపుడు, యక్షులు, సిద్ధులు, కిన్నెరులు మొదలైన దివ్య పురుషులచే పూజించబడినవాడు, సముద్ర తీరమున నివసించువాడైన ఆ షణ్ముఖుడిని ధ్యానిస్తున్నాను.

చంపకాబ్జమాలతీసుమాదిమాల్యభూషితం
దివ్యషట్కిరీటహారకుండలాద్యలంకృతమ్ |
కుంకుమాదియుక్తదివ్యగంధపంకలేపితం
భావయామి సింధుతీరవాసినం షడాననమ్ || ౩ ||

సంపెంగ, పద్మము, జాజి మొదలైన పుష్పమాలలచే అలంకరించబడినవాడు, దివ్యమైన ఆరు కిరీటములు, హారములు మరియు కుండలములతో ప్రకాశించువాడు, కుంకుమ మొదలైన దివ్య సుగంధ ద్రవ్యముల లేపనము కలిగినవాడు, సముద్ర తీరమున నివసించువాడైన ఆ షణ్ముఖుడిని ధ్యానిస్తున్నాను.

ఆశ్రితాఖిలేష్టలోకరక్షణామరాంఘ్రిపం
శక్తిపాణిమచ్యుతేంద్రపద్మసంభవాధిపమ్ |
శిష్టలోకచింతితార్థసిద్ధిదానలోలుపం
భావయామి సింధుతీరవాసినం షడాననమ్ || ౪ ||

ఆశ్రయించిన సమస్త లోకములను రక్షించుటలో కల్పవృక్షము వంటివాడు, చేతిలో శక్తి ఆయుధమును ధరించినవాడు, విష్ణువు (అచ్యుత), ఇంద్రుడు మరియు బ్రహ్మ (పద్మసంభవ) వంటి వారికే ప్రభువు (అధిపతి) అయినవాడు, సత్పురుషులు కోరుకున్న అర్థములను (కోరికలను) సిద్ధంపజేయుటలో ఆసక్తి కలిగినవాడు, సముద్ర తీరమున నివసించువాడైన ఆ షణ్ముఖుడిని ధ్యానిస్తున్నాను.

వీరబాహు పూర్వకోటివీరసంఘసౌఖ్యదం
శూరపద్మముఖ్యలక్షకోటిశూరముక్తిదమ్ |
ఇంద్రపూర్వదేవసంఘసిద్ధనిత్యసౌఖ్యదం
భావయామి సింధుతీరవాసినం షడాననమ్ || ౫ ||

వీరబాహువు మొదలైన కోట్ల కొద్దీ వీర సమూహములకు సౌఖ్యమును ప్రసాదించువాడు, శూరపద్ముడు మొదలైన లక్షల కోట్ల అసురులకు (యుద్ధంలో సంహరించడం ద్వారా) ముక్తిని ప్రసాదించినవాడు, ఇంద్రుడు మొదలైన దేవతా సమూహములకు మరియు సిద్ధులకు నిత్య సౌఖ్యమును అనుగ్రహించువాడు, సముద్ర తీరమున నివసించువాడైన ఆ షణ్ముఖుడిని ధ్యానిస్తున్నాను.

జంబవైరికామినీమనోరథాభిపూరకం
కుంభసంభవాయ సర్వధర్మసారదాయకమ్ |
తం భవాబ్ధిపోతమంబికేయమాశు సిద్ధిదం
భావయామి సింధుతీరవాసినం షడాననమ్ || ౬ ||

ఇంద్రుని భార్య (శచీదేవి) యొక్క మనోరథమును నెరవేర్చినవాడు, అగస్త్య మహర్షికి (కుంభసంభవుడు) సమస్త ధర్మములలోని సారాంశాన్ని ప్రసాదించినవాడు, సంసారమనే సముద్రాన్ని దాటించే నావ వంటివాడు, పార్వతీ పుత్రుడు (అంబికేయుడు) మరియు వెంటనే కార్యసిద్ధిని కలిగించువాడు, సముద్ర తీరమున నివసించువాడైన ఆ షణ్ముఖుడిని ధ్యానిస్తున్నాను.

పూర్ణచంద్రబింబకోటితుల్యవక్త్రపంకజం
వర్ణనీయసచ్చరిత్రమిష్టసిద్ధిదాయకమ్ |
స్వర్ణవర్ణగాత్రముగ్రసిద్ధలోకశిక్షకం
భావయామి సింధుతీరవాసినం షడాననమ్ || ౭ ||

కోట్ల కొద్దీ పూర్ణ చంద్రబింబములతో సమానమైన ముఖ పద్మము కలవాడు, వర్ణించదగిన ఉత్తమమైన చరిత్ర కలవాడు, భక్తుల ఇష్టార్థములను సిద్ధంపజేయువాడు, బంగారు వర్ణముతో మెరిసే దేహము కలవాడు, ఉగ్రాచారము గల సిద్ధ లోకమును సైతం శాసించి శిక్షించగల సమర్థుడు, సముద్ర తీరమున నివసించువాడైన ఆ షణ్ముఖుడిని ధ్యానిస్తున్నాను.

పూర్వజన్మసంచితాఘసంఘభంగతత్పరం
సర్వధర్మదానకర్మపూర్వపుణ్యసిద్ధిదమ్ |
సర్వశత్రుసంఘభంగదక్షమింద్రజాపతిం
భావయామి సింధుతీరవాసినం షడాననమ్ || ౮ ||

పూర్వ జన్మల నుండి పోగుపడిన పాప సమూహములను నాశనం చేయుటలో తత్పరత (శ్రద్ధ) కలవాడు, సర్వ ధర్మములు, దానములు మరియు సత్కర్మల ద్వారా కలిగే పుణ్య ఫలమును ప్రసాదించువాడు, సర్వ శత్రు సమూహములను అణచివేయుటలో దక్షుడు (సమర్థుడు) మరియు దేవసేన (ఇంద్రుని పుత్రిక) యొక్క పతి అయినవాడు, సముద్ర తీరమున నివసించువాడైన ఆ షణ్ముఖుడిని ధ్యానిస్తున్నాను.

ఇతి శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ తిరుచేందూర్ శ్రీ షణ్ముఖ స్తోత్రమ్ |


గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

See DetailsClick here to buy


మరిన్ని శ్రీ సుబ్రహ్మణ్య స్తోత్రాలు చూడండి.


మా తదుపరి ప్రచురణ: తెలుగు తాత్పర్యాలతో "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి" పుస్తకము ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము.

స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.

Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.

Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments
error: Not allowed