Yathiraja Vimsathi (with Telugu Meaning) – యతిరాజ వింశతిః



(శ్రీ రామానుజాచార్యుల పట్ల అత్యంత భక్తితో, వరవరముని (మణవాళ మామునిగళ్) రచించిన అద్భుతమైన స్తోత్రం “యతిరాజ వింశతి”. ఇందులో రామానుజుల వారి దివ్యమంగళ స్వరూపాన్ని, వారి ఆశ్రిత వాత్సల్యాన్ని కీర్తిస్తూ, తన అపరాధాలను క్షమించమని వేడుకునే ఆత్మార్పణ కనిపిస్తుంది.)

యః స్తుతిం యతిపతిప్రసాదనీం
వ్యాజహార యతిరాజవింశతిమ్ |
తం ప్రపన్న జనచాతకాంబుదం
నౌమి సౌమ్యవరయోగిపుంగవమ్ ||

యతిరాజుల (రామానుజుల) అనుగ్రహాన్ని పొందేలా చేసే ఈ ‘యతిరాజ వింశతి’ స్తోత్రాన్ని ఎవరు రచించారో; శరణాగతులనే చాతక పక్షులకు అమృత వర్షాన్ని కురిపించే మేఘము వంటివారో, అట్టి సౌమ్యవరయోగి (మణవాళ మామునులు) కి నేను నమస్కరిస్తున్నాను.

శ్రీమాధవాంఘ్రి జలజద్వయనిత్యసేవా
ప్రేమావిలాశయపరాంకుశపాదభక్తమ్ |
కామాదిదోషహరమాత్మ పదాశ్రితానాం
రామానుజం యతిపతిం ప్రణమామి మూర్ధ్నా || ౧ ||

శ్రీమహావిష్ణువు (మాధవ) పాదపద్మాల నిత్య సేవ యందు మిక్కిలి ప్రేమ కలిగిన హృదయము కలవారు; నమ్మాళ్వార్ (పరాంకుశ) పాదాలకు పరమ భక్తులైనవారు; తన పాదాలను ఆశ్రయించిన వారి యొక్క కామ క్రోధాది దోషాలను హరించేవారు; అట్టి యతిపతియైన రామానుజులకు నా శిరస్సుతో నమస్కరిస్తున్నాను.

శ్రీరంగరాజచరణాంబుజరాజహంసం
శ్రీమత్పరాంకుశపదాంబుజభృంగరాజమ్ |
శ్రీభట్టనాథపరకాలముఖాబ్జమిత్రం
శ్రీవత్సచిహ్నశరణం యతిరాజమీడే || ౨ ||

శ్రీరంగనాథుని (శ్రీరంగరాజ) పాద పద్మములకు రాజహంస వంటివారు; నమ్మాళ్వార్ (పరాంకుశ) పాద పద్మములకు తుమ్మెద (భృంగ) వంటివారు; పెరియాళ్వార్ (భట్టనాథ), తిరుమంగై ఆళ్వార్ (పరకాల) వంటి వారి ముఖపద్మాలకు సూర్యుని (మిత్ర) వంటివారు; కూరత్తాళ్వార్ (శ్రీవత్సచిహ్న) కు ఆశ్రయమైనవారు; అట్టి యతిరాజును స్తుతిస్తున్నాను.

వాచా యతీన్ద్ర మనసా వపుషా చ యుష్మత్
పాదారవిందయుగళం భజతాం గురూణామ్ |
కూరాధినాథకురు కేశముఖాద్యపుంసాం
పాదానుచిన్తనపరః సతతం భవేయమ్ || ౩ ||

ఓ యతీంద్రా! వాక్కుతోనూ, మనస్సుతోనూ, శరీరముతోనూ నీ పాదపద్మాలను భజించే గురువులు ఎవరైతే ఉన్నారో (కూరత్తాళ్వార్, పిళ్ళై లోకాచార్యులు మొదలైన మహనీయులు); అట్టి పుణ్యపురుషుల పాదాలను ఎల్లప్పుడూ (సతతం) చింతించేవాడిగా నేను ఉండాలి.

నిత్యం యతీంద్ర తవ దివ్యవపుః స్మృతౌ మే
సక్తం మనో భవతు వాగ్గుణకీర్తనేఽసౌ |
కృత్యం చ దాస్యకరణేతు కరద్వయస్య
వృత్త్యన్తరేఽస్తు విముఖం కరణత్రయం చ || ౪ ||

ఓ యతీంద్రా! నా మనస్సు నిరంతరం నీ దివ్య మంగళ విగ్రహాన్ని స్మరించుట యందే లగ్నం అవ్వాలి; నా వాక్కు నీ గుణకీర్తనము చేయుట యందే నిమగ్నం అవ్వాలి; నా రెండు చేతులు నీకు దాస్యం చేయుట యందే ఉండాలి; నా త్రికరణాలు (మనస్సు, వాక్కు, క్రియ) ఇతర విషయాల వైపుకు వెళ్లకుండా నీ యందే ఉండాలి.

అష్టాక్షరాఖ్యమనురాజపదత్రయార్థ
నిష్ఠాం మమాత్ర వితరాద్య యతీంద్రనాథ |
శిష్టాగ్రగణ్యజనసేవ్యభవత్పదాబ్జే
హృష్టాఽస్తు నిత్యమనుభూయ మమాస్య బుద్ధిః || ౫ ||

యతీంద్రనాథా! అష్టాక్షరీ మంత్రంలోని మూడు పదాల (ఓం, నమో, నారాయణాయ) యొక్క అర్థము నందు నాకు నిష్ఠను ప్రసాదించుము. శిష్టులలో అగ్రగణ్యులైన వారు సేవించే నీ పాద పద్మాలను అనుభవిస్తూ, నా బుద్ధి నిత్యం సంతోషముగా ఉండుగాక.

అల్పాఽపి మే న భవదీయపదాబ్జభక్తిః
శబ్దాదిభోగరుచిరన్వహమేధతే హా |
మత్పాపమేవ హి నిదానమముష్య నాన్యత్
తద్వారయార్య యతిరాజ దయైకసింధో || ౬ ||

అయ్యో (హా)! నీ పాదపద్మాల యందు నాకు కొంచెం కూడా భక్తి లేదు; కానీ శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాది ఇంద్రియ భోగాల యందు రుచి మాత్రం రోజురోజుకూ పెరుగుతోంది. దీనికి నా పాపమే కారణం తప్ప మరొకటి కాదు. ఓ దయైక సింధూ! యతిరాజా! దయచేసి దీనిని నివారించుము.

వృత్త్యా పశుర్నరవపుస్త్వహమీదృశోఽపి
శ్రుత్యాదిసిద్ధనిఖిలాత్మ గుణాశ్రయోఽయమ్ |
ఇత్యాదరేణ కృతినోఽపి మిథః ప్రవక్తుం
అద్యాపి వంచనపరోఽత్ర యతీంద్ర వర్తే || ౭ ||

యతీంద్రా! ప్రవర్తనలో నేను పశువు వంటివాడిని, కానీ మనిషి రూపాన్ని ధరించాను. అయినప్పటికీ, వేదాలలో చెప్పబడిన సద్గుణాలన్నీ నా యందే ఉన్నట్లుగా ఇతరుల ముందు నటిస్తున్నాను. ఇతరులను, నన్ను నేను వంచుకుంటూ ఇంకా ఇలాగే బ్రతుకుతున్నాను.

దుఃఖావహోఽహమనిశం తవ దుష్టచేష్టః
శబ్దాదిభోగనిరతః శరణాగతాఖ్యః |
త్వత్పాదభక్త ఇవ శిష్టజనౌఘమధ్యే
మిథ్యా చరామి యతిరాజ తతోఽస్మిమూర్ఖః || ౮ ||

యతిరాజా! నేను ఎల్లప్పుడూ (అనిశం) దుష్ట చేష్టలు చేస్తూ నీకు దుఃఖాన్ని కలిగించేవాడిని. ఇంద్రియ భోగాల యందే నిమగ్నమై ఉండి కూడా, బయటకు మాత్రం ‘శరణాగతుడను’ అని చెప్పుకుంటున్నాను. శిష్టులైన భక్తుల సమూహంలో నీ పాద భక్తుడి వలె మిథ్యగా (కపటంగా) సంచరిస్తున్నాను. అందుకే నేను మూర్ఖుడను.

నిత్యం త్వహం పరిభవామి గురుం చ మంత్రం
తద్దేవతామపి న కించిదహో బిభేమి |
ఇత్థం శఠోఽప్యశఠవద్భవదీయసంఘే
హృష్టశ్చరామి యతిరాజ తతోఽస్మిమూర్ఖః || ౯ ||

నిత్యం నేను నా గురువును, మంత్రాన్ని మరియు ఆ మంత్రాధిదేవతను (పరమాత్మను) అవమానిస్తున్నాను. అయ్యో! అపరాధం చేస్తున్నాననే భయం కూడా నాకు కొంచెం కూడా లేదు. ఇంతటి శఠుడనై (కపటినై) ఉండి కూడా, నీ భక్త సంఘంలో నిష్కపటి వలె సంతోషంగా తిరుగుతున్నాను. యతిరాజా! అందుకే నేను మూర్ఖుడను.

హా హన్త హన్త మనసా క్రియయా చ వాచా
యోఽహం చరామి సతతం త్రివిధాపచారాన్ |
సోఽహం తవాప్రియకరః ప్రియకృద్వదేవ
కాలం నయామి యతిరాజ తతోఽస్మిమూర్ఖః || ౧౦ ||

హా హంత (అయ్యో)! మనస్సుతో, క్రియతో, వాక్కుతో నేను నిరంతరం మూడు విధాలైన అపచారాలు (దేవతా, గురు, వైష్ణవ అపచారాలు) చేస్తున్నాను. నీకు అప్రియమైన పనులే చేస్తూ, నీకు ఇష్టుడి వలె నటిస్తూ కాలాన్ని గడుపుతున్నాను. యతిరాజా! అందుకే నేను మూర్ఖుడను.

పాపే కృతే యది భవన్తిభయానుతాప
లజ్జాః పునః కరణమస్య కథం ఘటేత |
మోహేన మే న భవతీహ భయాదిలేశః
తస్మాత్పునః పునరఘం యతిరాజ కుర్వే || ౧౧ ||

ఒకసారి పాపం చేసినప్పుడు భయం, పశ్చాత్తాపం, లజ్జ కలిగితే.. ఆ పాపాన్ని మళ్ళీ ఎలా చేస్తారు? కానీ నా మోహం వల్ల నాకు అట్టి భయాదులు లవలేశం కూడా కలగడం లేదు. అందువల్లనే ఓ యతిరాజా! నేను పదే పదే పాపాలు (అఘం) చేస్తున్నాను.

అన్తర్బహిః సకలవస్తుషు సన్తమీశం
అన్ధః పురః స్థితమివాహమవీక్షమాణః |
కందర్పవశ్యహృదయః సతతం భవామి
హన్త త్వదగ్రగమనస్య యతీంద్ర నార్హః || ౧౨ ||

అంతటా, అన్ని వస్తువుల యందూ వెలుగొందుతున్న ఈశ్వరుడిని.. కళ్ళు లేని వాడు (అంధుడు) ఎదురుగా ఉన్న వస్తువును చూడలేనట్లుగా నేను చూడలేకపోతున్నాను. నా హృదయం ఎప్పుడూ మన్మథుడికి (కామానికి) వశమై ఉంటోంది. యతీంద్రా! ఇన్ని లోపాలున్న నేను నీ ముందుకు రావడానికి కూడా అనర్హుడను.

తాపత్రయీజనితదుఃఖనిపాతినోఽపి
దేహస్థితౌ మమ రుచిస్తు న తన్నివృత్తౌ |
ఏతస్య కారణమహో మమ పాపమేవ
నాథ త్వమేవ హర తద్యతిరాజ శీఘ్రమ్ || ౧౩ ||

తాపత్రయాల వల్ల కలిగే దుఃఖంలో మునిగి ఉన్నప్పటికీ, నాకు ఈ దేహముపై ఉన్న ఆసక్తి, మోక్షము (దుఃఖ నివృత్తి) పై లేదు. అయ్యో! దీనికి కారణం నా పాపమే తప్ప మరొకటి కాదు. నాథా! యతిరాజా! దయచేసి ఆ పాపాన్ని శీఘ్రమే హరించుము.

వాచామగోచరమహాగుణదేశికాగ్ర్య
కూరాధినాథకథితాఖిలనైచ్యపాత్రమ్ |
ఏషోఽహమేవ న పునర్జగతీదృశస్తత్
రామానుజార్య కరుణైవ తు మద్గతిస్తే || ౧౪ ||

వాక్కులకు అందని మహాగుణాలు కలిగిన గురువులలో శ్రేష్ఠుడా! కూరత్తాళ్వార్ (కూరాధినాథ) తన స్తోత్రాలలో చెప్పుకున్న సమస్త నీచ గుణాలకు నేను మాత్రమే పాత్రుడను (నిజానికి వారు నిగర్వి కాబట్టి అలా చెప్పుకున్నారు, కానీ నాలో ఆ లోపాలు నిజంగా ఉన్నాయి). ఈ లోకంలో నా వంటి వాడు మరొకడు లేడు. రామానుజార్యా! నీ కరుణ ఒక్కటే నాకు గతి.

శుద్ధాత్మయామునగురూత్తమకూరనాథ
భట్టాఖ్యదేశికవరోక్తసమస్తనైచ్యమ్ |
అద్యాస్త్యసంకుచితమేవ మయీహ లోకే
తస్మాద్యతీంద్ర కరుణైవ తు మద్గతిస్తే || ౧౫ ||

నిర్మలమైన ఆత్మ కలిగిన యామునాచార్యులు, కూరత్తాళ్వార్, పరాశర భట్టర్ వంటి మహనీయులు తమ స్తోత్రాలలో ఏఏ నీచ గుణాల గురించి (వినయంతో) ప్రస్తావించారో, అవన్నీ ఇప్పుడు నా యందు సంకోచం లేకుండా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందువల్ల ఓ యతీంద్రా! నీ కరుణ తప్ప నాకు వేరే దిక్కు లేదు.

శబ్దాదిభోగవిషయా రుచిరస్మదీయా
నష్టా భవత్విహ భవద్దయయా యతీంద్ర |
త్వద్దాసదాసగణనాచరమావధౌ యః
తద్దాసతైకరసతాఽవిరతా మమాస్తు || ౧౬ ||

ఓ యతీంద్రా! శబ్ద, స్పర్శాది లౌకిక విషయాల యందు నాకు ఉన్న ఈ ఆసక్తి (రుచి) నీ దయ వల్ల ఇక్కడే నశించిపోవుగాక. నీ దాసుల యొక్క దాసుల సమూహంలో (దాస-దాస-గణనా) చివరి వ్యక్తి ఎవరైతే ఉంటారో, వారికి దాస్యం చేయుటలోనే నాకు నిరంతరం ఆనందం కలుగుగాక.

శ్రుత్యగ్రవేద్యనిజదివ్యగుణస్వరూపః
ప్రత్యక్షతాముపగతస్త్విహ రంగరాజః |
వశ్యః సదా భవతి తే యతిరాజ తస్మాత్
శక్తః స్వకీయజనపాపవిమోచనే త్వమ్ || ౧౭ ||

వేదాంతము (శ్రుత్యగ్ర) చేత మాత్రమే తెలియబడే దివ్య గుణములు, స్వరూపము కలిగిన ఆ రంగనాథుడు (రంగరాజః).. నీ భక్తికి వశుడై ఇక్కడ ప్రత్యక్షంగా వేంచేసి ఉన్నాడు. ఓ యతిరాజా! పరమాత్మే నీకు వశ్యుడై ఉన్నాడు కాబట్టి, నిన్ను ఆశ్రయించిన వారి పాపములను పోగొట్టే శక్తి (శక్తః) నీకు తప్పక ఉంది.

కాలత్రయేఽపి కరణత్రయనిర్మితాతి
పాపక్రియస్య శరణం భగవత్‍క్షమైవ |
సా చ త్వయైవ కమలారమణేఽర్థితా యత్
క్షేమః స ఏవహి యతీంద్ర భవచ్ఛ్రితానామ్ || ౧౮ ||

ముక్కాలము నందు (కాలత్రయే), త్రికరణములతో (మనస్సు, వాక్కు, క్రియ) నేను చేసిన అతి భయంకరమైన పాపాలకు ఆ భగవంతుని క్షమ ఒక్కటే శరణు. అట్టి భగవంతుని క్షమాగుణాన్ని నీవు ‘శరణాగతి గద్యం’ ద్వారా లక్ష్మీనాథుని (కమలారమణ) ప్రార్థించి మాకు లభింపజేశావు. అందుకే నిన్ను ఆశ్రయించిన వారికి క్షేమము నిశ్చయము.

శ్రీమన్ యతీంద్ర తవ దివ్యపదాబ్జసేవాం
శ్రీశైలనాథకరుణాపరిణామ దత్తామ్ |
తా మన్వహం మమ వివర్ధయ నాథ తస్యాః
కామం విరుద్ధమఖిలం చ నివర్తయ త్వమ్ || ౧౯ ||

శ్రీమంతుడవైన ఓ యతీంద్రా! నీ దివ్య పాదపద్మ సేవ అనేది నా ఆచార్యులైన శ్రీశైలనాథుల (తిరువాయ్మొళి పిళ్ళై) కరుణ వల్ల నాకు లభించిన ఫలము. ఓ నాథా! ఆ సేవను రోజురోజుకూ నాలో పెంపొందించుము (వివర్ధయ) మరియు ఆ సేవకు విరుద్ధమైన కోరికలన్నింటినీ నివారించుము.

విజ్ఞాపనం యదిదమద్య తు మామకీనం
అంగీకురుష్వ యతిరాజ దయాంబురాశే
అజ్ఞోయమాత్మగుణలేశ వివర్జితశ్చ
తస్మాదనన్యశరణో భవతీతి మత్వా || ౨౦ ||

దయా సముద్రుడవైన ఓ యతిరాజా! ఈ రోజు నేను చేసిన ఈ విన్నపాన్ని (విజ్ఞాపనం) అంగీకరించుము. వీడు అజ్ఞాని అని, ఆత్మ గుణములు లేశము కూడా లేనివాడని, నీవు తప్ప వేరే దిక్కు లేనివాడని (అనన్యశరణో) భావించి నన్ను నీవు కరుణించుము.

ఇతి యతికులధుర్య మేధమానైః
శ్రుతిమధురైరుదితైః ప్రహర్షయన్తమ్ |
వరవరమునిమేవ చిన్తయన్తీ
మతి రియమేతి నిరత్యయం ప్రసాదమ్ || ౨౧ ||

యతి శ్రేష్ఠుడైన రామానుజుని స్తుతిస్తూ, వేదాల వలె మధురమైన ఈ స్తోత్రాన్ని రచించి భక్తులను ఆనందింపజేసిన వరవరమునిని ఎల్లప్పుడూ చింతించే వారి బుద్ధి (మతిః), నాశనం లేని పరమ శాంతిని (ప్రసాదమ్) పొందుతుంది.


మరిన్ని శ్రీ గురు స్తోత్రాలు చూడండి. మరిన్ని వివిధ స్తోత్రాలు చూడండి.


మా ప్రచురణ: "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి (తాత్పర్య సహితం)" ప్రింటింగు పూర్తి అయి కొనుగోలుకు సిద్ధంగా ఉంది.

స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Support this Dharma Karya : If you find value in the Stotranidhi collection, please consider supporting this work. You can make a contribution through these links - PhonePe/GooglePay/BHIM (within India) or Paypal (outside India)

Buy Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".

విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.

Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

One thought on “Yathiraja Vimsathi (with Telugu Meaning) – యతిరాజ వింశతిః



స్పందించండి

error: Not allowed