Sri Kedareswara Vratha Katha – శ్రీ కేదారేశ్వర వ్రత కథ


(గమనిక: ముందుగా శ్రీ కేదారేశ్వర పూజ చేయవలెను )

(కృతజ్ఞతలు – బొమ్మకంటి వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి)

సూతపౌరాణికుండు శౌనకాది మహర్షులం గాంచి యిట్లనియె. “ఋషి పుంగవులారా! మానవులకు సర్వసౌభాగ్యముల గలుగంజేయునదియు, పార్వతీదేవిచే సాంబశివుని శరీరార్ధము పొందినదియునగు కేదారేశ్వర వ్రతమనునదొకటి గలదు. ఆ వ్రతవిధానమును వివరించెద వినుండు. దీనిని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శుద్రాదులు ఆచరించవచ్చును. ఈ వ్రతమును ఇరువదియొక్క మారులాచరించువారు సకల సంపదలనుభవించి పిదప శివసాయుజ్యము నొందుదురు.

ఓ మునిశ్రేష్ఠులారా! ఈ వ్రతమహాత్మ్యమును వివరించెద వినుండు. భూలోకంబునం దీశాన్యభాగమున మెరుపుగుంపులతో గూడియున్న శరత్కాల మేఘములంబోలు నిఖిలమణివిచిత్రంబైన శిఖరములచేతను, పలుతెరంగులైన లతావిశేషముల చేతను, బహువిధములగు పుష్ప ఫలాదులచేతను, నానావిధములైన పక్షులచేతను మరియు ననేకములైన కొండకాలువలచేతను వ్యాప్తంబయి సాలతమాల రసాలహింతాల వకుళాశోక చందన దేవదారు నారికేళామ్ర పనస నాగపున్నాగ చంపకాది వృక్షముల చేతను, నానాతరు విశేషముల చేతను భాసిల్లునట్టి యుద్యాన వనములచేత ప్రకాశించుచు నిఖిల కల్యాణప్రదంబై సర్వజన నమస్కృత్యంబై కైలాసమని పేర్కొనబడిన ఒక పర్వతశ్రేష్ఠము గలదు.

అంత షడ్గుణైశ్వర్య సంపన్నులను, మహామహనీయులు నగు యోగులచేతను, సిద్ధగంధర్వ కిన్నర కింపురుషాదులచేతను సేవింపబడి, మనోహరంబైయున్న యా పర్వతశిఖరమందు జగత్కర్తయైన పరమేశ్వరుండు ప్రమథగణములచే పరివేష్టింపబడి భవాని సమేతుండై సకల దేవముని బృందములచేత నమస్కరింపబడుచు ప్రసన్నుండై కూర్చుండి యొక సమయమున చతుర్ముఖాది దేవతల కందరికి దర్శనమిచ్చెను.

అంత సూర్యాగ్ని పవనులు, నక్షత్రయుక్తుండయిన నిశాకరుండును, మరియు నింద్రాది దేవతలును, వశిష్ఠాది మహర్షులును, రంభ మొదలగు అప్సరసలును, బ్రాహ్మీ మొదలగు సప్తమాతృకలును, సేనానియు, గణపతియును, తత్సారూప్యమును బొందియున్న నంది భృంగి మొదలగు ప్రమథ గణములును దన్ను పరివేష్ఠించి కొలుచుచుండ నట్టి భవానీవల్లభుని యత్యద్భుతంబగు సభయందు నారదుడు మొదలగు దేవగాయకులు స్వామి అనుజ్ఞవడసి గానము చేసిరి. అట్టి రమణీయంబును శ్రావ్యంబునగు గానము ప్రవర్ధిల్లుచుండగా ఘృతాచీ మేనకాదులు వీణాది చతుర్విధ వాద్యములతో, లయలతో కూడిన నృత్య మొనర్చిరి.

అప్పుడా వేల్పు బానిసలలోన మిక్కిలి సొగసుకత్తెయగు రంభ నిఖిల సురబృందముల యొక్క యల్లములు రంజిల్లునటుల నాట్యమొనరించెను. ఆ సమయమున భృంగిరిటి యనెడి భక్తవరుండు ఆ స్వామి సన్నిధి యందాయనకు ప్రీతి కలుగునట్లుగా వికట నాట్యము చేయగా అప్పుడు సకల దేవతలకు మిక్కుటమైన హాస్యము జనించెను. అటువంటి ఆశ్చర్యంబగు హాసముల వలన నప్పుడా పర్వత గుహలు నిండునటుల గొప్ప కలకల ధ్వని కలిగెను.

ఇట్లు హాస్యము విస్తరిల్లుచుండ సర్వేశ్వరుండగు శంకరుండు ఆ భృంగిరిటినింజూసి నీచేత మిగుల హర్షప్రవర్ధంబైన నాట్యము చేయబడెనని సెలవిచ్చి ముదంబంది యా భక్తుని అనుగ్రహించెను. అంతట నా భృంగిరిటికి శివానుగ్రహంబు గలుగుటం చేసి యతండు ప్రీతుండై సకల విబుధులచే గౌరవింపబడి సమాహితచిత్తుండై వినయంబుతో గూడి, యా పార్వతీదేవిని వదలి, ఈశ్వరునికి మాత్రము ప్రదక్షిణ నమస్కారము లొనరించెను. అప్పుడు పార్వతి చిరునగవుతో గూడినదై తన పతియగున ప్పరమేశ్వరుని వీక్షించి “ఓ స్వామీ! ఈ భృంగిరిటి నన్ను విడిచి మీకు మాత్రమే ప్రదక్షిణము నాచరించుటకు కారణమేమి! విన వేడుకగా నున్నది. ఆనతీయవే” యని వేడగా నా సదాశివుడు “ఓ ప్రియురాలా! చెప్పెద వినుము. పరమార్థ విదులగు యోగులకు నీవలన బ్రయోజనంబు లేమింజేసి, నాకు మాత్రమే నమస్కరించె” నని చెప్పెను.

ఆ మాటలకు పరమేశ్వరి మిగుల వ్రీడనుపొంది, భర్తయందున్న తన శక్తి నాకర్షించగా నా స్వామి త్వగ స్థ్వ్యావశిష్ట మా త్రావయవుండాయె. అంత నా దేవియు సారహీనురాలై వికటురాలాయెను. పిదప నాదేవి కోపించి దేవతలచేత నూరడింపబడినదైనను, కైలాసమును వదలి తపం బొనరించుటకు బహువిధంబులగు సింహ శరభ శార్దూల గజమృగాదులచే సేవింపబడునదియు నిత్యవైర ముడిగియున్న పన్నగ గరుడాది సకల జంతువులచే నిబిడంబగు నదియు, నానావిధ వృక్షలతా గుల్మాది భూయిష్టంబయి ఋషిశ్రేష్ఠ సేవితంబై సర్వాభీష్టప్రదంబై యొప్పుచున్న గౌతమాశ్రమమును ప్రవేశించెను.

అంత నా గౌతముండు వన్యంబులై హోమయోగ్యంబులగు సమిత్కుశ ఫలాదులను సంగ్రహించుకొని వనమునుండి వచ్చునెడ దన యాశ్రమ భాగమున వెలుగుచున్న ప్రకాశమును జూచి ఋష్యాశ్రమం బగునది ఇట్లు శోభిల్లుచున్నదేమా యని విస్మయం బంది దత్కారణము చింతుంచుచు ఆశ్రమము ప్రవేశించి తామర రేకులవంటి కన్నులు గలిగి యలంకృతురాలై యున్న యా మహేశ్వరిం గనుగొని “పూజ్యురాలైన ఓ భగవతీ ! నీ విచ్చటి కేతెంచుటకు కారణంబే” మని అడుగగా, నా దేవియు ఆ జడధారికి తన విషాద కారణమును వచించి నమస్కరించి, “ఓ మునీశ్వరా! ఏ వ్రతము యోగులకు సమ్మతమైనదో, యే వ్రతానుష్ఠానముచేత శంకర దేహార్ధము నాకు ఘటించునో అటువంటి వ్రతము నుపదేశింపుము” అనగా ఆ మహర్షి సకల శాస్త్రపురాణావలోకనం బాచరించి యీప్సితార్థప్రదంబగు శ్రీమ త్కేదార నామకంబైన ఉత్తమ వ్రతము నాచరింపుమని ఉపదేశించెను. అంత నా దేవియు నావ్రతానుష్ఠానక్రమము ఆనతీయవేయని వేడగా ఇటులని చెప్పదొడంగెను.

“అమ్మా! భాద్రపద శుక్లాష్టమియందు శుద్ధమనస్కురాలవై మంగళకరములగు నేకవింశతి తంతువులచేత హస్తమునందు ప్రతిసరమును ధరించి, పూజించి, యా దినమందు ఉపవాస మొనరించి, మరునాడు బ్రాహ్మణ భోజనము చేయించి, అది మొదలు అమావాస్య వరకు నీ వ్రతము నిటుల సలుపుచు ప్రతిదినము నందును శ్రీమత్కేదార దేవు నారాధింపవలయును. మరియు నింటియందు శుభ్రంబగు ఒక ప్రదేశమున ధాన్యరాశిలో పూర్ణకుంభము నుంచి, ఇరువదియొక్క సూత్రములచేత జుట్టి, పట్టుపుట్టములచేత కప్పియుంచి, నవరత్నములు గాని శక్తికొలది సువర్ణమును గాని ఉంచి గంధపుష్పాక్షతలచే నర్చించి ఇరువదియొక్కమంది బ్రాహ్మణులను పిలిపించి పాదప్రక్షాళనాది కృత్యము లాచరించి కూర్చుండ నియోగించి, అచట ఆ కేదార దేవుని ప్రతిష్ఠింపజేసి చందనాగరు కస్తూరీ కుంకుమాదులను, శ్రీగంధమును, నానావిధ పుష్పములను తాంబూలములను వస్త్రములనుంచి నివేదన మొనరించి, యథాశాస్త్రముగ ధూపదీపాదులచే నర్చించి, ఏకవింశతి సంఖ్యాకంబులయిన చోష్యలే హ్యాదులను కదళీ పనసామాద్రి ఫలములను నైవేద్యముజేసి, తాంబూలము లొసంగి, చక్కగా స్తోత్రముజేసి, బ్రాహ్మణులకు యధాశక్తి దక్షిణలిచ్చి వ్రతమును లెస్సగా ననుష్ఠించి ఈశ్వరునికి మనస్సంతుష్టి చేసినయెడల, యా వృషభధ్వజుండు ప్రీతుండై నీవు కోరిన వరము లియ్యగలడు” అని వచించిన నా కాత్యాయినియు నటులేయగుగాక యని ఆచరించెను.

అంత పరమశివుండు సంతుష్టాంతరంగుడై అచటికి దేవగణముల తోడం జని “నా శరీరార్ధమును నీకు ఇచ్చెద” నని ఇవ్వగా, నా పార్వతీదేవి యుప్పొంగి శంకర దేహార్ధమును బొంది లోకానుగ్రహము జేయదలంచి దన పతియగు పరమశివునితో “నీవ్రతము నాచరించువారలకు సకలాభీష్టసిద్ధి గలుగునటుల అనుగ్రహించితిరేని ఎల్ల వారు నాచరింతు” రనగా, నటులే యగుగాక యని అంగీకరించి శివుడు సురసంఘములతో కూడ నచ్చట నంతర్హితుండయ్యె.

మరి కొంతకాలమునకు శివభక్తి యుక్తుండగు చిత్రాంగదుండను గంధర్వుండు నందికేశ్వరుని వలన నావ్రతచర్యా క్రమంబెరిగి మనుష్య లోకమునకుంజని వారలకు ఉపదేశింప వలయునని నిచ్ఛగలవాడై యుజ్జయినీ పట్టణమును జేరి వజ్రదంతుడను రాజునకు ఆ వ్రతమును ఉపదేశింప, అతడు ఆ వ్రతమును కల్పోక్తప్రకారంబుగ నాచరించి సార్వభౌముండాయెను.

మరికొంత కాలమునకు నా పట్టణమున నున్న వైశ్యునకు పుణ్యవతియు, భాగ్యవతియు నను నిరువురు కుమార్తెలు గలిగిరి. వారిద్దరును తండ్రిదగ్గరకు బోయి కేదార వ్రతమాచరించుట కానతీయుమని వేడగా నతడు “అమ్మా! నేను మిగుల దరిద్రుడను. మీరా తలంపుమాను”డనగా “ఓ తండ్రీ! నీయనుజ్ఞయే మాకు పరమధనంబుగాన ఆనతీయు”మని సెలవు పుచ్చుకొని ఒక వటవృక్షము వద్ద కూర్చుండి ప్రతిసరము గట్టికొని యథావిధిగా పూజింప వారల భక్తికి మెచ్చి ఈశ్వరుడు వలయు సామగ్రి ని ఇచ్చెను.

అంతట వారలు చక్కగా వ్రతము నాచరించుట వలన ఆ మహాదేవుండు ప్రీతుండయి ఆ కన్యలకు ఆయురారోగ్య ఐశ్వర్యములను, దివ్యరూపంబుల నొసంగి అంతర్ధానుండాయెను.

పిమ్మట నావ్రత మహాత్మ్యము వలన నుజ్జయినీ పట్టణమును నేలుచున్న రాజు పుణ్యవతియను కన్యను, చోళ భూపాలుడు భాగ్యవతియను కన్యను పాణిగ్రహణం బొనర్చికొనిరి. అందువలన నావైశ్యుండు ధనసమృద్ధి గలిగి సామ్రాజ్య సంపదలను, పుత్రులను బొంది సుఖమున నుండెను.

కొన్నినాళ్ళ పిదప- రెండవదియైన భాగ్యవతి అనునది ఐశ్వర్య మదమోహితురాలై కొంత కాలమునకు నా వ్రతమును విడిచెను. అందువలన భాగ్యహీనురాలై పుత్రుని తోడ పెనిమిటిచేత వెడలనంపబడి అడవిలో తిరిగి సంచారఖిన్నురాలై ఒక బోయవాని యిల్లు చేరెను. అచ్చట పుత్రుని జూచి “నాయనా! నా అక్కయగు పుణ్యవతిని ఉజ్జయినీ పురపు రాజు వివాహమాడి యున్నవాడు. నీ వచ్చటకిపోయి మన సంగతి నెరింగించి బ్రతుకు తెరువునకై తగినంత ధనము తీసికొని శీఘ్రముగా ర”మ్మనగా నంతడు ఆ పట్టణమునకు బోయి పెద్ద తల్లితో తన తల్లి యొక్క దుస్సహంబగు కష్టమును దెలుపగా నా పుణ్యవతియు నతని చేతికి విస్తారముగ ధనము నిచ్చెను.

అంత నాతడా ధనమును తీసుకొని వచ్చుచుండగా, మార్గమున నదృశ్యరూపుండైన ఆ దేవుని వలన నాధనం బపహరింప బడగా, నతడు మరలా పెద్దతల్లి కడకేతెంచి ఆ వృత్తాంతమును విన్నవించి మరికొంత ధనము సంగ్రహించుకొని వచ్చెను. ఆ ధనము గూడా హరింపబడగా దోదూయమానసుండై నిలువంబడియున్న వానితో ఈశ్వరుం డదృశ్యుండై “ఓ చిన్నవాడా! వ్రతభ్రష్టులకు నీధనంబు గ్రహింప నలవికానిదని” చెప్పెను. ఆ మాటలు విని విస్మయంబంది, ఆ చిన్నవాడు మరల ముందువలనే ఉజ్జయినీ పట్టణమునకుంజని ఈశ్వరోక్తంబగు వృత్తాంతమును పెద్దతల్లికి దెలుపగా నా పుణ్యవతి ఆలోచించి పుత్రునిచేత కేదార వ్రతంబు నాచరింపజేసి తన చెల్లెలు కూడా వ్రతము నాచరించు నటుల చెప్పవలయునని చెప్పి, ధనము నొసంగి పంపెను.

అతండు బయలుదేరి వచ్చునెడి మార్గంబున నప్రయత్నముగ ముందు గోలుపోయిన ధనమంతయు స్వాధీనమైనందున సంతోషించి, సర్వమునూ గ్రహించుకొని కాంచీపట్టణమును ప్రవేశించు సమయంబున చతురంగ బలములతోడ అతనితండ్రి ఎదుర్కోలుగా వచ్చి, ఆ బాలునీ అతని తల్లిని కూడా వెంట బెట్టుకొని తన పట్టణమునకుం జనియే. అంతట నా రాకుమారుడు తల్లిదండ్రులతో గూడి సుఖముగా నుండెను.

పిమ్మట తల్లియగు భాగ్యవతియును తండ్రియగు చోళరాజును నదిమొదలు ఈ వ్రతము నాచరించుచు అవిచ్ఛిన్నంబగు సకల సంపద లనుభవించుచుండిరి.

ఎవరైనను యథోక్తప్రకారము నీవ్రతమహాత్మ్యమును భక్తియుక్తులై వినిన, జదివిన అట్టివారలందరును శ్రీమహాదేవుని అనుగ్రహము వలన అనంతంబులగు ఆయురారోగ్య యైశ్వర్యంబులను బొంది సుఖంబు లనుభవించి శివసాయుజ్యమును బొందుదురని గౌతమమహాఋషిచే జెప్పబడెనని సూతుండు శౌనకాదులకు జెప్పినట్లుగా శ్రీవ్యాసభట్టారకుడు స్కాంద పురాణమునం దభివర్ణించెను.

సమర్పణం –
యస్య స్మృత్యాచ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు |
న్యూనం సంపూర్ణతాం యాతి సద్యోవందే మహేశ్వరం ||
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వర |
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే ||

అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మికః శ్రీ కేదారేశ్వర స్వామి సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు ||


మరిన్ని వ్రతములు చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

error: Not allowed