Sri Siddhi Vinayaka Vratha Katha – శ్రీ సిద్ధివినాయక వ్రత కథ



(గమనిక: ఈ వ్రతకల్పం “శ్రీ గణేశ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.)

<< శ్రీ సిద్ధి వినాయక వ్రతకల్పం (2)

విఘ్నేశ్వరుని కథా ప్రారంభము

ఒకానొకప్పుడు నైమిశారణ్యములో సత్రయాగము చేస్తున్న శౌనకాదిమహర్షులకు సకలకథావిశారదుడైన సూతమహాముని విఘ్నేశ్వరోత్పత్తి, చంద్రదర్శన దోషకారణము, శాపమోక్షప్రకారము చెప్పసాగెను.

– గజాసుర వృత్తాంతం –

పూర్వం గజరూపంతో ఉన్న రాక్షసేశ్వరుడు శివుని కోసం ఘోర తపస్సు చేయగా, అతని తపస్సుకు మెచ్చి ఈశ్వరుడు ప్రత్యక్ష్యమై వరము కోరుకోమని అడుగగా, ఆ గజాసురుడు పరమేశ్వరుని స్తుతించి “స్వామీ! మీరు ఎప్పుడూ నా ఉదరములో నివసించి కాపాడండి” అని కోరగా భక్తసులభుడైన ఆ మహేశ్వరుడు అతని కోరిక తీర్చడం కోసం గజాసురుడి ఉదరములో ప్రవేశించి ఉండసాగెను.

కైలాసములో పార్వతీదేవి భర్తజాడ తెలియక పలుమార్లు అన్వేషిస్తూ గజాసుర గర్భములో ఉన్న విషయం తెలుసుకొని రప్పించుకునే మార్గము కోసం విష్ణుమూర్తిని ప్రార్థించి తన పతివృత్తాంతం చెప్పి, “ఓ మహానుభావ! పూర్వం భస్మాసురుడి బారినుండి నా పతిని రక్షించి నాకు ఇచ్చావు. ఇప్పుడుకూడ ఉపాయముతో రక్షించ” మని విలపించగా హరి ఆ పార్వతీదేవిని ఊరడించి కైలాసములోనే ఉండమని చెప్పి, బ్రహ్మాదిదేవతలను పిలిపించి గజాసుర సంహారానికి గంగిరెద్దుల మేళమే సరైనది అని నిశ్చయించి, పరమేశ్వర వాహనమైన నందిని గంగిరెద్దుగా అలంకరించి, బ్రహ్మాదిదేవతలందరికి విచిత్ర వాద్యాలని ధరింపచేసి తాను చిరుగంటలు, సన్నాయిని తీసుకుని గజాసురపురానికి వెళ్ళి అక్కడ జగన్మోహనంగా ఆడిస్తూ ఉండగా గజాసురుడు విని, వాళ్ళని పిలిపించి తన భవనం ఎదురుగా ఆడించగా బ్రహ్మాదిదేవతలు తమ వాద్యవిశేషాలతో సందడి చేయగా జగన్నాటక సూత్రధారి అయిన ఆ హరి చిత్రవిచిత్రముగా గంగిరెద్దుని ఆడించగా గజాసురుడు పరమానందభరితుడై “మీకేమి కావాలో కోరుకోండి ఇస్తాను” అని చెప్పాడు. హరి అతని దగ్గరకు వచ్చి “ఇది శివుని వాహనమైన నంది, శివుడిని వెతకడానికి వచ్చింది. కాబట్టి శివుడిని ఇవ్వు” అని చెప్పెను. ఆ మాటలకు గజాసురుడు ఆశ్చర్యపడి, అతనిని రాక్షసాంతకుడైన శ్రీహరిగా తెలుసుకొని ఇక తనకు మరణమే తథ్యం అని అర్థం చేసుకుని తన గర్భములో ఉన్న పరమేశ్వరుడిని తలుచుకుని “నా శిరస్సు త్రిలోకపూజ్యముగా చేసి, నా చర్మాన్ని నువ్వు ధరించుము” అని ప్రార్థించి, విష్ణుమూర్తికి తన అంగీకారము చెప్పగా అతడు నందిని ప్రేరేపించెను. నంది తన శృంగాలతో గజాసురుని చీల్చి సంహరించింది. అంతలో మహేశ్వరుడు గజాసుర గర్భమునుండి బయటకు వచ్చి విష్ణుమూర్తిని స్తుతించెను. అప్పుడు ఆ హరి “దుష్టాత్ములకు ఇలాంటి వరాలు ఇవ్వకూడదు. ఇస్తే పాముకి పాలు పోసినట్లే అవుతుంది” అని చెప్పి ఈశ్వరుడికి, బ్రహ్మాది దేవతలకు వీడుకోలు పలికి, వైకుంఠానికి వెళ్ళాడు. తరువాత శివుడు నందినెక్కి కైలాసానికి వెళ్ళాడు.

– వినాయకోత్పత్తి –

కైలాసంలో పార్వతీదేవి భర్త రాకను దేవతల ద్వారా విని, ఆనందించి, అభ్యంగన స్నానం చేయబోతూ నలుగుపిండితో ఒక బాలుడిని చేసి, ప్రాణం పోసి, వాకిలి ద్వారము దగ్గర కాపలాగా ఉంచింది. పార్వతిదేవి స్నానం చేసి, ఆభరణాలు అలంకరించుకుని భర్తరాక కోసము వేచియుంది. అంతలో పరమేశ్వరుడు కైలాసమందిరానికి వచ్చి, నంది మీదనుంచి దిగి లోపలికి వెళుతుంటే వాకిలి ద్వారము దగ్గర ఉన్న బాలకుడు అడ్డగించగా, కోపము వచ్చి ఆవేశముగా తన త్రిశూలంతో ఆ బాలకుడి కంఠము తురిమి లోపలికి వెళ్ళెను.

పార్వతీదేవి భర్తను చూసి ఎదురు వెళ్ళి అర్ఘ్యపాద్యాలతో పూజించెను. పరమానందంగా వాళ్ళిద్దరు ముచ్చటిస్తూ ఉండగా ద్వారము దగ్గరి బాలుడి ప్రస్తావన వచ్చింది. మహేశ్వరుడు తాను చేసిన పనికి చింతించి తాను తీసుకువచ్చిన గజాసుర శిరస్సును ఆ బాలుడికి అతికించి ప్రాణము పోసి గజాననుడు అనే పేరు పెట్టి పుత్రప్రేమతో ఉమామహేశ్వరులు పెంచుకోసాగారు. గజాననుడును తల్లిదండ్రులకు పరమభక్తితో సేవలు చేసుకుంటూ ఉండెను. గజాననుడు సులభంగా ఎక్కి తిరగడం కోసం అనింద్యుడు అనే ఒక ఎలుకను వాహనంగా చేసుకున్నాడు.

కొంతకాలానికి పార్వతీపరమేశ్వరులకు కుమారస్వామి పుట్టాడు. అతడు మహాబలశాలి. అతని వాహనం నెమలి. అతడు దేవతల సేనానాయకుడిగా ప్రఖ్యాతి గడించాడు.

– విఘ్నాధిపత్యం –

ఒకనాడు దేవతలు, మునులు, మానవులు కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుణ్ణి సేవించి, విఘ్నాలకు ఒకరిని అధిపతిగా తమకు ఇవ్వమని కోరగా, గజాననుడు తాను జ్యేష్ఠుడను కనుక ఆధిపత్యము తనకు ఇవ్వమనగా, గజాననుడు మరుగుజ్జువాడు, అనర్హుడు, అసమర్థుడు కనుక ఆ ఆధిపత్యము తనకు ఇవ్వమని కుమారస్వామి తండ్రిని వేడుకొన్నారు. ఆ కుమారులను చూసి “మీలో ఎవరు ముల్లోకాలలో ఉన్న పుణ్యనదులలో స్నానం చేసి ముందుగా నా దగ్గరకు వస్తారో, వారికి ఆధిపత్యం ఇస్తాను” అని మహేశ్వరుడు చెప్పెను. సరే అని సమ్మతించి కుమారస్వామి నెమలివాహనం ఎక్కి వాయువేగంతో వెళ్ళెను.

గజాననుడు ఖిన్నుడై తండ్రిని సమీపించి ప్రణామం చేసి “అయ్యా! నా అసమర్థత తెలిసికూడా ఇలాంటి ఆనతి ఇవ్వతగునా? మీ పాదసేవకుడిని. నన్ను కటాక్షించి ఒక ఉపాయము చెప్పి రక్షించండి” అని ప్రార్థించగా, మహేశ్వరుడు దయాళుడై “సకృత్ నారాయణేత్యుక్త్వా పుమాన్ కల్పశతత్రయం. గంగాదిసర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక.” “కుమారా! ఒక్కసారి నారాయణమంత్రాన్ని పఠిస్తే మూడువందల కల్పాల పుణ్యనదులలో స్నానము చేసిన ఫలితం వస్తుంది” అని సక్రమంగా నారాయణమంత్రం ఉపదేశం చేయగా, గజాననుడు అత్యంత భక్తితో ఆ మంత్రం జపిస్తూ కైలాసంలో ఉండెను.

ఆ మంత్రప్రభావం వల్ల అంతకు ముందు గంగా నదికి స్నానము చేయడం కోసం వెళ్ళిన కుమారస్వామికి గజాననుడు ఆ నదిలో స్నానమాడి తనకి ఎదురుగా వస్తున్నట్లు కనిపించింది. అలాగే మూడుకోట్ల యాభైలక్షల నదులలో కూడా అలాగే చూసి ఆశ్చర్యపడి కైలాసానికి వెళ్ళగా, అక్కడ తండ్రి సమీపంలో ఉన్న గజాననుడిని చూసి నమస్కరించి, తన బలాన్ని నిందించుకొని, “తండ్రీ! అన్నగారి మహిమ తెలియక అలా అన్నాను, క్షమించండి. తమ నిర్ణయం ప్రకారం ఈ ఆధిపత్యము అన్నగారికే ఇవ్వండి” అని ప్రార్థించెను.

అప్పుడు పరమేశ్వరునిచే భాద్రపద శుద్ధ చతుర్థీ నాడు గజాననుడికి విఘ్నాధిపత్యం ఇవ్వబడింది. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరుడికి తమ వైభవము కొద్ది కుడుములు, అప్పములు వంటి పిండివంటలు, కొబ్బరికాయలు, పాలు, తేనె, అరటిపండ్లు, పానకము, వడపప్పు, మొదలైనవి సమర్పించి పూజించగా విఘ్నేశ్వరుడు సంతోషించి కుడుములు మొదలైనవి తను భక్షించి, కొన్ని వాహనానికి ఇచ్చి, కొన్ని చేతిలో పట్టుకొని మెల్లిమెల్లిగా సూర్యాస్తమయ సమయానికి కైలాసానికి వెళ్ళి తల్లిదండ్రులకు ప్రణామం చేద్దామనుకుంటే పొట్ట భూమికి తగిలితే చేతులు భూమికి అందకపోయె, బలవంతంగా చేతులను ఆనిస్తే పాదాలు ఆకాశాన్ని చూశాయి. ఇలా దండప్రణామం చేయడం కోసం శ్రమపడుతూ ఉండగా శివుని శిరస్సుమీద ఉన్న చంద్రుడు చూచి వికటంగా నవ్వాడు. రాజదృష్టి సోకితే రాలుగూడ నుగ్గగును అనే సామెత నిజమైనట్లు విఘ్నదేవుని గర్భము పగిలి, అందులో ఉన్న కుడుములు ఆ ప్రదేశములో దొర్లాయి. అతడు మృతుడైనాడు.

పార్వతిదేవి శోకిస్తూ చంద్రుణ్ణి చూసి, “పాపాత్ముడా! నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించెను కనుక నిన్ను చూసినవారు పాపాత్ములై అపనిందలు పొందుతారు” అని శపించెను.

– ఋషిపత్నులకు అపనిందలు కలగడం –

ఆ సమయములో సప్తమహర్షులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో కలిసి అగ్నికి ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నారు. అగ్నిదేవుడు ఋషిపత్నులను చూసి మోహించి శాపభయం వల్ల అశక్తుడై క్షీణించగా, అది అగ్ని భార్యయైన స్వాహాదేవి గమనించి అరుంధతి రూపము కాకుండా మిగిలిన ఋషిపత్నుల రూపము తానే ధరించి పతికి ప్రియము చేసింది. ఋషులు ఇది గమనించి అగ్నిదేవుడితో ఉన్నవారు తమ భార్యలే అని అనుమానించి ఋషులు తమ భార్యలను వదిలివేసెను. పార్వతి శాపము తరువాత ఋషిపత్నులు చంద్రుణ్ణి చూడటం వల్ల వీరికి ఇలాంటి నిరాపనింద కలిగింది. దేవతలు, మునులు ఋషిపత్నులకు వచ్చిన ఆపద పరమేష్ఠికి చెప్పగా అతడు సర్వజ్ఞుడు అవ్వడం వల్ల అగ్నిహోత్రుడి భార్య ఋషిపత్నుల రూపము ధరించి రావడం గురించి చెప్పి సప్తమహర్షులను సమాధానపరిచాడు. వాళ్ళతో కలిసి బ్రహ్మ కైలాసానికి వెళ్ళి ఉమామహేశ్వరులను సేవించి మృతుడై పడియున్న విఘ్నేశ్వరుడిని బ్రతికించి ఆనందమునిచ్చెను. ఆ దేవాదులు “ఓ దేవీ! పార్వతీ! నీవు ఇచ్చిన శాపము వలన అన్నిలోకాలకు కీడు వాటిల్లుతోంది కనుక దానిని ఉపసంహరించు”మని ప్రార్థించగా పార్వతి సంతుష్టురాలై కుమారుడిని చేరదీసి ముద్దాడి “ఏ రోజు విఘ్నేశ్వరుడిని చూసి చంద్రుడు నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడరాదు” అని శాప అవకాశము ఇచ్చెను. బ్రహ్మాదిదేవతలు మొదలైనవారు సంతోషంగా తమ నివాసాలకు వెళ్ళి, భాద్రపద శుద్ధ చతుర్థీ నాడు మాత్రం చంద్రుడిని చూడక సుఖముగా ఉండెను.

– శమంతకోపాఖ్యానము –

ద్వాపరయుగంలో ద్వారకావాసియైన శ్రీకృష్ణుడిని నారదుడు దర్శించి స్తుతించి మాట్లాడుతూ “స్వామీ! సాయం సమయం అవుతోంది. ఈరోజు వినాయక చతుర్థి. పార్వతీశాపము వలన చంద్రుడిని చూడకూడదు కనుక నేను నా నివాసానికి వెళ్తాను” అని శ్రీకృష్ణుడికి వృత్తాంతము చెప్పి నారదుడు స్వర్గలోకానికి వెళ్ళాడు. శ్రీకృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుడిని ఎవ్వరూ చూడకూడదని తన పట్టణంలో చాటింపు వేయించెను. ఆనాటి రాత్రి శ్రీకృష్ణుడు క్షీరప్రియుడు అవ్వడం వలన ఆకాశం వైపు చూడకుండా గోశాలకు పోయి పాలు పితుకుతూ ఆ పాలల్లో చంద్రుడి ప్రతిబింబం చూసి “ఆహా! ఇప్పుడు నాకేమి అపనింద వస్తుందో” అన్న సంశయంలో ఉండెను.

కొన్నాళ్ళకు సత్రాజిత్తు సూర్యుడి వరం వల్ల శమంతకమణిని సంపాదించాడు. ద్వారకాపట్టణమునకు శ్రీకృష్ణ దర్శనార్థమై వెళ్ళాడు. శ్రీకృష్ణుడు అతనికి మర్యాదలు చేసి, ఆ మణిని మన రాజుకివ్వమని అడిగాడు. అతడు “ఎనిమిది బారువుల బంగారము రోజుకు ఇచ్చే మణి ఇది. ఎంతటి ఆప్తులకైనా ఏ మందమతైనా ఇస్తాడా” అని చెప్పాడు. సరే పోనివ్వమని శ్రీకృష్ణుడు ఊరుకున్నాడు. ఒకనాడు ఆ సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనుడు ఆ శమంతకమణిని ఆభరణంగా ధరించి వేటకోసం అడవికి వెళ్ళగా, అక్కడ ఒక సింహం ఆ మణిని మాంసపుముక్క అని అనుకుని అతనిని చంపి ఆ మణిని తీసుకొనిపోతూ ఉండగా, ఒక ఎలుగుబంటి ఆ సింహాన్ని నిగ్రహించి ఆ మణిని తీసుకుని పోయి తన కొండగుహలోని ఉయ్యాలలో ఉన్న తన కుమార్తెకు ఆటవస్తువుగా ఇచ్చింది. మరుసటిరోజు సత్రాజిత్తు తన తమ్ముడి మృతి విని, “కృష్ణుడు మణి ఇవ్వలేదని నా తమ్ముడిని చంపి, రత్నం దొంగలించాడు” అని పట్టణములో చాటింపు వేయించాడు. అది శ్రీకృష్ణుడు విని “ఆహా! ఆరోజు పాలల్లో చంద్రబింబం చూసిన దోషఫలం ఇలా కలిగింది” అని అనుకొని అపనింద తీర్చుకోవడానికి బంధుజన సేనాసమేతుడై అరణ్యముకు పోయి వెదకగా ఒక్కచోట ప్రసేన మృత కళేబరము, సింహపు కాలిజాడలు, తరువాత ఎలుగుబంటి చరణ విన్యాసం కనిపించింది.

ఆ దారిని పట్టి పోతూ ఉండగా ఒక పర్వతగుహలోకి ఈ చిహ్నాలు వెళ్ళినట్టు కనిపించాయి. ఆ గుహద్వారము దగ్గర పరివారమును ఉండమని చెప్పి, కృష్ణుడు గుహలోపలికి వెళ్ళెను. అక్కడ ధగధగా మెరిసిపోతున్న బాలిక ఉయ్యాలపైన కట్టిన మణిని చూసి, మెల్లిగా వెళ్ళి ఆ మణిని పట్టుకుని వస్తుంటే ఉయ్యలలోని బాలిక ఏడవసాగింది. ఒక వింతమనిషి వచ్చింది అంటూ పక్కన ఉన్న దాది కేకలు వేయడం ప్రారంభించింది. అది విని గుహలో ఉన్న జాంబవంతుడు రోషావేశుడై వచ్చి శ్రీకృష్ణుడిపై పడి అరుస్తూ, గోళ్ళతో గుచ్చుతూ, కోరలతో కొరుకుతూ, ఘోరంగా యుద్ధం చేస్తూ ఉండగా, శ్రీకృష్ణుడు వాడిని పడదోసి, వృక్షాలచేత, రాళ్ళచేత, ఆఖరికి పిడిగుద్దులతో రాత్రింబవళ్ళు యుద్ధం చేయగా, జాంబవంతుడి బలం క్షీణించి, శరీరమంతా నొప్పులు వచ్చి భయపడి, తన బలం హరించిన పురుషుడు రావణసంహారి అయిన శ్రీరామచంద్రుడే అని అర్థం చేసుకుని, నమస్కరించి “దేవాధిదేవా! ఆర్తజనపోషా! భక్తజనరక్షా! నిన్ను త్రేతాయుగంలో రావణాది దుష్టరాక్షసులను సంహరించడానికి అవతరించి, భక్తులను పాలించిన శ్రీరామచంద్రుడిగా అర్థం చేసుకున్నాను. ఆ కాలంలో నాపై ఉన్న వాత్సల్యంతో నన్ను వరం కోరుకోమని అడిగితే నా బుద్ధిమాంద్యంతో మీతో ద్వంద్వయుద్ధం చేయాలని కోరుకున్నాను. తరువాతికాలంలో ఇది జరుగుతుంది అని మీరు చెప్పారు. అప్పటి నుంచి మీ నామస్మరణ చేస్తూ చాలా యుగాలు గడుపుతూ ఇలా ఉండగా మీరు నా నివాసానికి దయచేసి నా కోరిక నెరవేర్చారు. నా శరీరమంతా శిథిలమయ్యింది. ప్రాణాలు పోతున్నట్టు ఉంది. జీవించాలనే ఇచ్ఛ నశించింది. నా తప్పులు క్షమించి కాపాడండి. మీరు కాక నాకు వేరే దిక్కులేదు” అంటూ భయంతో ప్రార్థించగా శ్రీకృష్ణుడు దయాళుడై జాంబవంతుడి శరీరమంతా తన చేతితో నిమిరి భయము తీర్చి “ఓ భల్లుకేశ్వరా! శమంతకమణిని అపహరించాను అని నాపై వచ్చిన అపనిందను తొలగించుకోవడానికి వచ్చాను. కనుక మణిని నాకు ఇస్తే నేను వెళతాను” అని జాంబవంతుడికి చెప్పగా అతడు శ్రీకృష్ణుడికి మణిసహితంగా తన కుమార్తె అయిన జాంబవతిని కూడా కానుకగా ఇచ్చి రక్షించమని అడిగాడు. శ్రీకృష్ణుడు అతనికి అభయమిచ్చి, ఆ గుహ బయట ఉన్న తన బంధుమిత్రులకి, సైన్యానికి ఆనందము కలిగించి కన్యారత్నంతోనూ, మణితోనూ శ్రీకృష్ణుడు తన పురానికి వెళ్ళాడు.

తరువాత తన సభాస్థలానికి సత్రాజిత్తును పిలిపించి, జరిగినదంతా చెప్పి, ప్రజల సమక్షంలో అతనికి శమంతకమణిని ఇచ్చాడు. అప్పుడు ఆ సత్రాజిత్తు “అయ్యో! పరమాత్ముడైన శ్రీకృష్ణుడిమీద లేనిపోని నిందలు మోపి దోషానికి పాల్పడ్డాను” అని చాలా చింతించి ఆ మణితోపాటు తన కుమార్తె అయిన సత్యభామను భార్యగా శ్రీకృష్ణుడికి సమర్పించి తప్పు క్షమించమని వేడుకొన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామను పాణిగ్రహణము చేసుకుని, సంతోషించి “వేరే మణులెందుకు? నాకు భామామణి చాలు. సూర్యవరప్రసాదితమైన ఈ శమంతకమణిని నువ్వే ఉంచుకో. నాకు వద్దు” అంటూ మణిని సత్రాజిత్తుకు తిరిగి ఇచ్చెను. శ్రీకృష్ణుడు ఒక శుభముహూర్తంలో జాంబవతి, సత్యభామలను పెళ్ళి చేసుకున్నాడు. అక్కడికి వచ్చిన దేవతలు, మునులు శ్రీకృష్ణుడిని స్తుతించి “మీరు సమర్థులు కనుక అపనింద తొలగించుకున్నారు. మా గతి ఏంటి?” అని ప్రార్థించగా శ్రీకృష్ణుడు దయాళుడై “భాద్రపద శుద్ధ చతుర్థి రోజున ప్రమాదవశాత్తు చంద్రదర్శనం అయినా కూడా, ఆరోజు గణపతిని యథావిధిగా పూజించి ఈ శమంతకమణి కథను విని అక్షతలు శిరస్సుపై వేసుకుంటే అపనిందలు పడకుండా ఉంటారు” అని ఆజ్ఞ ఇచ్చాడు. దేవాదులు “అనుగ్రహించబడ్డాం” అని ఆనందించి తమ తమ నివాసాలకు వెళ్ళి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థీ నాడు దేవతలు, మహర్షులు, మానవులు మొదలైనవారు వారి వారి శక్తికొద్ది గణపతిని పూజించి తమ అభీష్టములు తీర్చుకుంటూ సుఖంగా ఉన్నారు. ఈ విధంగా శాపమోక్ష ప్రకారము శౌనకాదిమునులకు సూతుడు వినిపించి వారికి వీడుకోలు పలికి తన నిజనివాసానికి వెళ్ళెను.

గమనిక : చంద్రదోష పరిహారార్థము ఈ శ్లోకము చెప్పుకొని అక్షతలు వేసుకోవాలి.

సింహః ప్రసేనమవధీత్ సింహో జాంబవతా హతః |
సుకుమారక మా రోదీః తవ హ్యేష శమంతకః ||

సర్వేజనాస్సుఖినోభవంతు |

విఘ్నేశ్వర దండకం, మంగళహారతులు చూ. |


(గమనిక: ఈ వ్రతకల్పం “శ్రీ గణేశ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.)

మరిన్ని శ్రీ గణేశ స్తోత్రాలు చూడండి.


మా తదుపరి ప్రచురణ: తెలుగు తాత్పర్యాలతో "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి" పుస్తకము ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము.

స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.

Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.

Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

స్పందించండి

error: Not allowed