Sundaradasu (Sri MS Rama Rao) Sundarakanda Part 2 – సుందరదాసు సుందరకాండ (ద్వితీయ భాగం)


[ ప్రథమ భాగం – ద్వితీయ భాగం ]

తండ్రిమాట నిలుప రామచంద్రుడు
వల్కల ధారియై రాజ్యము వీడె .
సీతాలక్ష్మణులు తనతో రాగా
పదునాల్గేండ్లు వనవాసమేగె . ౧౫౧

ఖరదూషణాది పదునాల్గువేల
అసురుల జంపె జనస్థానమున .
అని హనుమంతుడు మృదుమధురముగా
పలికెను సీతారామ కథ . ౧౫౨

రాముడు వెడలె సీత కోర్కె పై
మాయ లేడిని కొనితెచ్చుటకై .
రామ లక్ష్మణులు లేని సమయమున
అపహరించె లంకేశుడు సీతను . ౧౫౩

సీతను గానక రామచంద్రుడు
అడవుల పాలై వెదకుచుండెను .
అని హనుమంతుడు మృదుమధురముగా
పలికెను సీతారామ కథ . ౧౫౪

రామసుగ్రీవులు వనమున కలిసిరి
మిత్రులైరి ప్రతిజ్ఞల బూనిరి .
శ్రీరఘురాముడు వాలిని గూల్చెను
సుగ్రీవుని కపిరాజుగ జేసెను . ౧౫౫

సుగ్రీవులాన లంక చేరితి
సీతా మాతను కనుగొన గలిగితి .
అని హనుమంతుడు మృదుమధురముగా
పలికెను సీతారామ కథ . ౧౫౬

వానరోత్తముడు పలుకుట మానెను
జానకికెంతో విస్మయమాయెను .
భయము భయముగ నలువంకలు గని
మెల్లగ మోమెత్తి పైకి చూచెను . ౧౫౭

శోభిల్లు శంశుపా శాఖలందున
బాలార్కుని వలె మారుతి తోచెను .
మారుతి రూపము చిన్నదైనను
తేజోమయమై భీతి గొల్పెను . ౧౫౮ | శ్రీ హనుమాను |

తల్లీ ! తెల్పుము నీవు యెవరవో
దేవ గంధర్వ కిన్నెరాంగనవో .
కాంతులు మెరసే బంగరు మేన
మలినాంబరమేల దాల్చితివో ?౧౫౯

ఓ కమలాక్షీ ! నీ కనుదోయి
నీలాలేల నింపితివో ?
అని హనుమంతుడు తరువు నుండి దిగి
అంజలి ఘటించి చెంతన నిలిచె . ౧౬౦

రావణాసురుడు అపహరించిన
రాముని సతివో నీవు సీతవో ?
రామ లక్ష్మణులు వనమున వెదకెడు
అవనీజాతవో నీవు సీతవో ?౧౬౧

సర్వ సులక్షణ లక్షిత జాతవు
తల్లీ తెల్పుము నీవు యెవరవో ?
అని హనుమంతుడు సీతతో పలికె
అంజలి ఘటించి చెంతన నిలిచె . ౧౬౨

జనక మహీపతి ప్రియ పుత్రికను
దశరథ మహిపతి పెద్ద కోడలను .
శ్రీరఘురాముని ప్రియసతి నేను
సీత యను పేర వరలు దానను . ౧౬౩

పరిణయమైన పదిరెండేడులు
అనుభవించితిని భోగభాగ్యములు .
అని పల్కె సీత వానరేంద్రునితో
రామ కథను కీర్తించిన వానితో . ౧౬౪

రావణుడొసగిన యేడాది గడువు
రెండు నెలలో యిక తీరిపోవు .
రాముడు నన్ను కాపాడునని
వేచి వేచి వేసారి పోతిని . ౧౬౫

అసురులు నన్ను చంపక ముందే
నాకై నేను పోనెంచితిని .
అని పల్కె సీత వానరేంద్రునితో
రామ కథను కీర్తించిన వానితో . ౧౬౬

అమ్మా సీతా, నమ్ముము నన్ను
రాముని దూతగా వచ్చినాడను .
రామలక్ష్మణులు క్షేమమన్నారు
నీ క్షేమమరసి రమ్మన్నారు . ౧౬౭

రాముడు నీకు దీవెనలంపె
సౌమిత్రి నీకు వందనములిడె .
అని హనుమంతుడు సీతతో పలికె
అంజలి ఘటించి ముందుకు జరిగె . ౧౬౮

మారుతి యెంతగా ముందుకు జరిగెనో
జానకి అంతగా అనుమానించెను .
రావణాసురుడే ఈ వానరుడని
కామరూపుడై వచ్చి యుండునని . ౧౬౯

ఆశ్రమమున వొంటిగనున్న తనను
వంచించిన సన్యాసి యీతడని.
తల వాల్చుకొని భయకంపితయై
కటిక నేలపై జానకి తూలె . ౧౭౦

వానరరాజు సుగ్రీవుని మంత్రిని
నన్ను పిలుతురు హనుమంతుడని .
రామ సుగ్రీవులు మిత్రులైనారు
నీ జాడ తెలియ వేచియున్నారు . ౧౭౧

రామలక్ష్మణులు వానర రాజుతో
లంక చేరెదరు వానర కోటితో .
అని హనుమంతుడు సీతతో పలికె
అంజలి ఘటించి చెంతన నిలిచె . ౧౭౨ | శ్రీ హనుమాను |

ఓ హనుమంతా ! హాయి పొందితిని
నీ పలికిన శ్రీరామ కథ విని .
రామలక్ష్మణుల యెట్లెరిగితివి ?
రూపు రేఖలను యెట్లు గాంచితివి ?౧౭౩

వారి మాటలను యెట్లు వింటివి ?
వారి గుణములను యెట్లు తెలిసితివి ?
అని పల్కె సీత హనుమంతునితో
రామ కథను కీర్తించిన వానితో . ౧౭౪

సర్వ జీవన సంప్రీతి పాత్రుడు
కమల నేత్రుడు దయా సాంద్రుడు .
బుద్ధి యందు బృహస్పతి సముడు
కీర్తి యందు దేవేంద్రుని సముడు . ౧౭౫

క్షమా గుణమున పృథివీ సముడు
సూర్య తేజుడు శ్రీరఘురాముడు .
అని హనుమంతుడు సీతతో పలికె
అంజలి ఘటించి చెంతన నిలిచె . ౧౭౬

అన్నకు తగు తమ్ముడు లక్ష్మణుడు
అన్నిట రాముని సరిపోలు వాడు .
అన్నకు తోడు నీడయై చెలగెడు
అజేయుడు శత్రుభయంకరుడు . ౧౭౭

సామాన్యులు కారు సోదరులిరువురు
నిను వెదకుచు మమ్ము కలసినారు .
అని హనుమంతుడు సీతతో పలికె
అంజలి ఘటించి చెంతన నిలిచె . ౧౭౮

పవనకుమారుని పలుకులను విని
అతడు నిజముగా రామదూత యని .
ఆనందాశ్రులు కన్నులు నిండగ
చిరు నగవులతో జానకి చూడగ . ౧౭౯

ఇదిగో తల్లీ ! యిది తిలకింపుము
రాముడంపిన అంగుళీయకము .
అని హనుమంతుడు భక్తి మీరగను
అంగుళీయకమును సీతకొసగెను . ౧౮౦ | శ్రీ హనుమాను |

రామచంద్రుని ముద్రిక చేకొని
అశ్రులు నిండిన కనులకద్దుకొని .
మధుర స్మృతులు మదిలో మెదల
సిగ్గు చేత తన శిరము వంచుకొని . ౧౮౧

యిన్ని రోజులకు తనకు కలిగిన
శుభ శకునముల విశేషమనుకొని .
జానకి పల్కె హనుమంతునితో
సంపూర్ణమైన విశ్వాసముతో . ౧౮౨

యెన్నడు రాముడు యిటకేతెంచునో
యెన్నడు రావణుని హతము సేయునో ?
లక్ష్మణుండు తన అగ్ని శరములతో
కౄర రాక్షసుల రూపు మాపునో ? ౧౮౩

సుగ్రీవుడు తన వానరసేనతో
చుట్టి ముట్టి యీ లంకను గూల్చునో ?
అని పల్కె సీత హనుమంతునితో
సంపూర్ణమైన విశ్వాసముతో . ౧౮౪

రామలక్ష్మణులు వచ్చుదాకను
బ్రతుకనిత్తురా అసురులు నన్ను ?
రావణుడొసగిన యేడాది గడువు
రెండు నెలలలో యిక తీరిపోవు . ౧౮౫

ప్రాణములను అరచేత నిల్పుకొని
యెదురు చూతునీ రెండు మాసములు .
అని పల్కె సీత హనుమంతునితో
సంపూర్ణమైన విశ్వాసముతో . ౧౮౬

నీ వలెనే శ్రీరామచంద్రుడు
నిద్రాహారములు మరచెనమ్మా !
ఫలపూష్పాదులు ప్రియమైనవి గని
“హా సీతా” యని శోకించునమ్మా . ౧౮౭

నీ జాడ తెలిసి కోదండపాణి
తడవు సేయకే రాగలడమ్మా .
అని హనుమంతుడు సీతతో పలికె
అంజలి ఘటించి చెంతన నిలిచె . ౧౮౮

ఓ హనుమంతా ! నిను గనినంత
నాలో కలిగె ప్రశాంతత కొంత .
వానరోత్తమా ! నిను వినినంత
నే పొందితిని వూరట కొంత . ౧౮౯

రాముని వేగమె రమ్మని తెల్పుము
రెండు నెలల గడువు మరువబోకుము .
అని పల్కె సీత హనుమంతునితో
సంపూర్ణమైన విశ్వాసముతో . ౧౯౦ | శ్రీ హనుమాను |

తల్లీ నీవిటు శోకింపనేల
వగచి వగచి యిటు భీతిల్లనేల ?
యిపుడే నీకీ చెర విడిపింతును
కూర్చుండుము నా మోపు మీదను . ౧౯౧

వచ్చిన త్రోవనే కొనిపోయెదను
శ్రీరామునితో నిను చేర్చెదను .
అని హనుమంతుడు సీతతో పలికె
అంజలి ఘటించి చెంతన నిలిచె . ౧౯౨

పోనివ్వక పోతివిగా హనుమా !
సహజమైన నీ చంచల భావము .
అరయగ అల్ప శరీరుడవీవు
యే తీరుగ నను కొని పోగలవు ?౧౯౩

రాముని కడకే నను చేర్చెదవో
కడలిలోననే జారవిడుతువో .
అని పల్కె సీత హనుమంతునితో
తనలో కలిగిన వాత్సల్యముతో . ౧౯౪

సీత పలికిన మాటల తీరును
హనుమంతుడు విని చిన్నబోయెను .
సీత చెంత తన కామ రూపమును
ప్రదర్శింపగా సంకల్పించెను . ౧౯౫

కొండంతగ తన కాయము పెంచెను
కాంతివంతుడై చెంత నిలచెను .
జయ హనుమంతుని కామరూపమును
ఆశ్చర్యముతో జానకి చూచెను . ౧౯౬

అద్భుతమౌ నీ కామరూపమును
కాంచితినయ్యా శాంతింపుమయ్యా !
పవనకుమారా నీవు గాక మరి
యెవరీ వారిధి దాటెదరయ్యా ! ౧౯౭

కౄర రాక్షసుల కంట బడకయే
లంక వెదకి నను కనగలరయ్యా .
అని పల్కె సీత హనుమంతునితో
సంపూర్ణమైన విశ్వాసముతో . ౧౯౮ | శ్రీ హనుమాను |

తల్లీ ! నేను నీ యందుగల
భక్తి భావమున అటుల తెల్పితి .
కౄర రాక్షసుల బారి నుండి నిను
కాపాడనెంచి అటుల పల్కితి . ౧౯౯

వేగమె నిన్ను రాముని జేర్చెడు
శుభ ఘడియలకై త్వరపడి పల్కితి .
అని హనుమంతుడు సీతతో పలికె
అంజలి ఘటించి చెంతన నిలిచె . ౨౦౦

తల్లీ నీవు తెలిపినవన్నీ
శ్రీరామునకు విన్నవించెదను .
సత్య ధర్మ పవిత్ర చరిత్రవు
శ్రీరామునకు తగిన భార్యవు . ౨౦౧

అమ్మా యిమ్ము యేదో గురుతుగ
శ్రీరాముడు గని ఆనందింపగ .
అని హనుమంతుడు సీతతో పలికె
అంజలి ఘటించి చెంతన నిలిచె . ౨౦౨

చిత్రకూటమున కాకాసురు కథ
కన్నీరొలుకగ గురుతుగ తెలిపి .
చెంగుముడి నున్న చూడామణిని
మెల్లగ తీసి మారుతికొసగి . ౨౦౩

పదిలముగా కొని పోయిరమ్మని
శ్రీరామునకు గురుతుగ నిమ్మని .
ప్రీతి పల్కె సీత హనుమంతునితో
సంపూర్ణమైన విశ్వాసముతో . ౨౦౪

చేతులారగా చూడామణి గొని
ఆనందముగా కనులకద్దుకొని .
వైదేహికి ప్రదక్షిణలు జేసి
పదముల వ్రాలి వందనములిడి . ౨౦౫

మనమున రాముని ధ్యానించుకొని
మరలిపోవగా అనుమతి గైకొని .
అంజనీసుతుడు కాయము పెంచె
ఉత్తర దిశగా కుప్పించి యెగసె . ౨౦౬ | శ్రీ హనుమాను |

సీత జాడ గని మరలిన చాలదు
చేయవలసినది యింకను కలదు .
కల్పించుకుని కలహము పెంచెద
అసురవీరుల పరిశీలించెద . ౨౦౭

రాక్షస బలముల శక్తి గ్రహించెద
సుగ్రీవాదులకు విన్నవించెద .
అని హనుమంతుడు యోచన జేయుచు
తోరణ స్తంభము పైన నిల్చెను . ౨౦౮

పద్మాకరముల పాడొనరించి
జలాశయముల గట్టులు త్రెంచి .
ఫల వృక్షముల నేలను కూల్చి
ఉద్యానముల రూపులు మాపి . ౨౦౯

ప్రాకారముల బ్రద్దలు చేసి
ద్వారబంధముల ధ్వంసము జేసి .
సుందరమైన అశోకవనమును
చిందర వందర చేసె మారుతి . ౨౧౦

మృగ సమూహములు భీతిల్లినవై
తత్తరపాటుగ పరుగులు తీయగ .
పక్షుల గుంపులు చెల్లాచెదరై
దీనారవముల యెగిరి పోవగా . ౨౧౧

సీత యున్న శింశుపా తరువు వినా
వనమంతయు వినాశము కాగా .
సుందరమైన అశోకవనమును
చిందర వందర చేసె మారుతి . ౨౧౨

వనమున రేగిన ధ్వనులకు అదిరి
లంకావాసులు నిద్ర లేచిరి .
కావలియున్న రాక్షస వనితలు
రావణు చేరి విన్నవించిరి . ౨౧౩

దశకంఠుడు మహోగ్రుడై పల్కె
వానరుని బట్టి దండింపుడనె .
యెనుబది వేల కింకర వీరులు
హనుమంతునిపై దాడి వెడలిరి . ౨౧౪

యెనుబది వేల కింకర వీరుల
వొక్క వానరుడు హతము చేసెను .
ఈ వృత్తాంతము వినిన రావణుడు
నిప్పులు గ్రక్కుచు గర్జన చేసెను . ౨౧౫

జంబుమాలిని తగిన బలము గొని
ఆ వానరుని దండింప పొమ్మనెను .
జంబుమాలి ప్రహస్తుని సుతుడు
హనుమంతుని పై దాడి వెడలెను . ౨౧౬ | శ్రీ హనుమాను |

జంబుమాలిని సర్వ సైన్యమును
వొక్క వానరుడు ఉక్కడగించెను .
ఈ వృత్తాంతము వినిన రావణుడు
నిప్పులు గ్రక్కుచు ఆజ్ఞాపించెను . ౨౧౭

మంత్రికుమారుల తగిన బలము గొని
ఆ వానరుని దండింపగ పొమ్మనె .
మంత్రికుమారులు యేడ్గురు చేరి
హనుమంతునిపై దాడి వెడలిరి . ౨౧౮

మంత్రిసుతులను సర్వ సైన్యమును
మారుతి తృటిలో సంహరించెను .
యెటు చూచినను మృత దేహములు
యెటు పోయినను రక్తపుటేరులు . ౨౧౯

ఈ వృత్తాంతము వినిన రావణుడు
కొంత తడవు యోచించి పల్కెను .
సేనాపతులను తగిన బలము గొని
ఆ వానరుని దండింప పొమ్మనెను . ౨౨౦

సేనాపతులను సర్వ సైన్యమును
పవనకుమారుడు నిర్మూలించెను .
ఈ వృత్తాంతము వినిన రావణుడు
నిశ్చేష్టితుడై పరివీక్షించెను . ౨౨౧

తండ్రిచూపులు తనపై సోకగ
అక్ష కుమారుడు ఇటవుగ నిలువగ .
రావణుండు పల్కె కుమారుని గని
ఆ వానరుని దండింప పొమ్మని . ౨౨౨ | శ్రీ హనుమాను |

అక్షకుమారుడు నవ యవ్వనుడు
వేగవంతుడు తేజోవంతుడు .
దివ్యాస్త్రములను పొందినవాడు
మణిమయ స్వర్ణ కిరీట శోభితుడు . ౨౨౩

కాలాగ్ని వోలె ప్రజ్వరిల్లెడు
రణధీరుడు మహావీరుడు .
అక్షకుమారుడు దివ్య రథము పై
దాడి వెడలెను హనుమంతుని పై . ౨౨౪

మూడు శరములతో మారుతి శిరమును
పది శరములతో మారుతి ఉరమును .
అక్షకుమారుడు బలముగ నాటెను
రక్తము చిందగ గాయ పరచెను . ౨౨౫

ఉదయ భాస్కర సమాన తేజమున
మారుతి యెగసె గగన మార్గమున .
యిరువురి నడుమ భీకరమైన
పోరు చెలరేగె ఆకాశమున . ౨౨౬

అతి నేర్పు తోడ రణము సల్పెడు
అక్షకుమారుని మారుతి దయగొని .
బాలుని చంపగ చేతులు రావని
వేచిచూచెను నిగ్రహించుకొని . ౨౨౭

అక్షకుమారుడు అంతకంతకును
అగ్నిహోత్రుడై రణమున రేగెను .
యిరువురి నడుమ భికరమైన
పోరు చెలరేగె ఆకాశమున . ౨౨౮

అగ్ని కణమని జాలి కూడదని
రగులక మునుపే ఆర్పుట మేలని .
సింహనాదమును మారుతి చేసెను
అరచేత చరచి హయముల జంపెను . ౨౨౯

రధమును బట్టి విరిచి వేసెను
అక్షుని ద్రుంచి విసరి వేసెను .
అక్షుని మొండెము అతి ఘోరముగ
నేలపై బడె రక్తపు ముద్దగ . ౨౩౦

అక్ష కుమారుని మరణ వార్త విని
లంకేశ్వరుడు కడు దుఃఖించెను .
మెల్లగ తేరి క్రోధము బూని
తన కుమారుని ఇంద్రజిత్తు గని . ౨౩౧

ఆ వానరుడు సామాన్యుడు గాడని
వానిని వేగ బంధించి తెమ్మని .
రావణాసురుడు ఇంద్రజిత్తును
హనుమంతుని పై దాడి పంపెను . ౨౩౨

కపికుంజరుడు భయంకరముగ
కాయము పెంచి సమరము సేయగ .
ఈ వానరుడు సామాన్యుడు గాడని
మహిమోపేతుడు కామరూపుడని . ౨౩౩

ఇంద్రజిత్తు బహుయోచన చేసి
బ్రహ్మాస్త్రమును ప్రయోగము చేసె .
దేవ గణంబులు సంగ్రామము గని
తహతహలాడిరి యేమగునోయని . ౨౩౪

బ్రహ్మాస్త్రము చే బంధింపబడి
పవనకుమారుడు నేలపై బడె .
వనజభవుడు తనకు వొసగిన వరము
స్మరియించుకొని ప్రార్థన చేసె . ౨౩౫

వాయు బ్రహ్మ ఇంద్రాది దేవతల
కాపాడుమని ధ్యానము చేసె .
దేవ గణంబులు సంగ్రామము గని
తహతహలాడిరి యేమగునోయని . ౨౩౬

కట్టుపడియున్న వానరోత్తముని
అసురులు తలచిరి తమకు లొంగెనని .
త్వరత్వరగా దానవులు దరి చేరి
నారచీరెలతో బిగి బంధించిరి . ౨౩౭

బ్రహ్మ వరమున బ్రహ్మాస్త్ర బంధము
క్షణకాలములో తొలగి పోయెను .
మారుతి మాత్రము నారచీరెలకె
కట్టుపడినటుల కదలక యుండె . ౨౩౮

వానరోత్తముని దూషణలాడుచు
రావణు కడకు యీడ్చుకు పోవగ .
ఈ వానరుని వధించివేయుడని
మన యెడ ద్రోహము చేసినాడని . ౨౩౯

రక్తనేత్రముల నిప్పులు రాలగ
లంకేశ్వరుడు గర్జన సేయగ .
రావణు తమ్ముడు విభీషణుడు
దూతను చంపుట తగదని తెల్పెను . ౨౪౦ | శ్రీ హనుమాను |

అన్నా రావణా ! తెలిసినవాడవు
శాంతముగా నా మనవిని వినుమా .
దూతను జంపుట ధర్మము గానిది
లోకముచే గర్హింపబడునది . ౨౪౧

శూరుడవైన నీకు తగనిది
రాజధర్మ విరుద్ధమైనది .
అని విభీషణుడు లంకేశునితో
దూతను చంపుట తగదని తెల్పెను . ౨౪౨

అన్నా ! వీనిని వధింపకుమా
తగు రీతిని దండించి పంపుమా .
దూత యెడల విధింపబడినవి
వధ గాక తగిన దండనలున్నవి . ౨౪౩

తల గొరిగించుట, చబుకు వేయుట,
గురుతు వేయుట, వికలాంగు సేయుట .
అని విభీషణుడు లంకేశునితో
దూతను చంపుట తగదని తెల్పెను . ౨౪౪ | శ్రీ హనుమాను |

కపులకు వాలము ప్రియ భూషణము
కావున కాల్చుడు వీని వాలము .
వాడ వాడల వూరేగింపుడు
పరాభవించి వదలివేయుడు . ౨౪౫

కాలిన తోకతో వీడేగు గాక !
అంపిన వారికి తలవొంపు గాక !
అని రావణుడు విభీషణుని గని
ఆజ్ఞాపించెను కోపమణచుకొని . ౨౪౬

జీర్ణాంబరములు అసురులు దెచ్చిరి
వాయుకుమారుని తోకకు జుట్టిరి .
నూనెతో తడిపి నిప్పంటించిరి
మంటలు మండగ సంతసించిరి . ౨౪౭

కపికుంజరుని యీడ్చుకు పోయిరి
నడి వీధులలో వూరేగించిరి .
మారుతి మాత్రము మిన్నకుండెను
సమయము కాదని సాగిపోయెను . ౨౪౮

కపిని బంధించి తోక గాల్చిరని
నడి వీధులలో త్రిప్పుచుండిరని .
రాక్షస వనితలు వేడుక మీరగ
పరుగున పోయి సీతకు తెలుపగ . ౨౪౯

అంతటి ఆపద తన మూలమున
వాయుసుతునకు వాటిల్లెనని .
సీతా మాత కడు చింతించెను
అగ్ని దేవుని ప్రార్థన చేసెను . ౨౫౦

ఓర్వరానివై మండిన మంటలు
ఒక్కసారిగా చల్లగ దోచెను .
అగ్ని దేవునకు, నా జనకునకు
అన్యోన్యమైన మైత్రిచేతనో . ౨౫౧

రామ దూతనై వచ్చుట చేతనో
సీతా మాత మహిమ చేతనో .
మండే జ్వాలలు పిల్లగాలులై
వీవసాగెనని మారుతి పొంగెను . ౨౫౨

ఆనందముతో కాయము పెంచెను
బంధములన్నీ తెగిపడిపోయెను .
అడ్డగించిన అసురులందరని
అరచేత చరచి అట్టడగించెను . ౨౫౩

గిరిశిఖరము వలె యెత్తుగ నున్న
నగర ద్వార గోపురమందున .
స్తంభము పైకి మారుతి యెగసెను
లంకాపురమును పరివీక్షించెను . ౨౫౪ | శ్రీ హనుమాను |

యే మంటల నా వాలము గాల్చిరో
ఆ మంటలనే లంక గాల్తునని .
భీమ రూపుడై గర్జన సేయుచు
రుద్ర రూపుడై మంటల జిమ్ముచు . ౨౫౫

మేడ మిద్దెల వనాల భవనాల
వెలిగించెను జ్వాలా తోరణాల .
చూచి రమ్మనిన కాల్చి వచ్చిన
ఘన విఖ్యాతి గణించె మారుతి . ౨౫౬

ఒకచో కుంకుమ కుసుమ కాంతుల
ఒకయెడ బూరుగు పుష్పఛాయల .
ఒకచో మోదుగు విరుల తేజముల
ఒకయెడ కరగిన లోహపు వెలుగుల . ౨౫౭

కోటి సూర్య సమాన కాంతుల
లంకాపురము రగిలెను మంటల .
చూచి రమ్మనిన కాల్చి వచ్చిన
ఘన విఖ్యాతి గణించె మారుతి . ౨౫౮ | శ్రీ హనుమాను |

హనుమంతుడు సముద్ర జలాల
చల్లార్చుకొనే లాంగూల జ్వాల .
తలచిన కార్యము నెరవేర్చితినని
తేరిపార జూచె వెనుకకు తిరిగి . ౨౫౯

కనుపించెను ఘోరాతిఘోరము
జ్వాలాభీలము లంకాపురము .
మారుతి వగచె తా చేసిన పనిగని
తన కోపమె తన శత్రువాయెనని . ౨౬౦

సీతామాత క్షేమము మరచితి
కోపతాపమున లంక దహించితి .
లంకా పురము సర్వము పోగా
ఇంకా జానకి మిగిలియుండునా ?౨౬౧

సిగ్గు మాలిన స్వామి ద్రోహిని
సీతను చంపిన మహాపాపినని .
మారుతి వగచె తా చేసిన పనిగని
తన కోసమె తన శత్రువాయెనని . ౨౬౨

సీత లేనిదె రాముడుండడు
రాముడు లేనిదె లక్ష్మణుడుండడు .
భరత శత్రుఘ్న సుగ్రీవాదులు
ఈ దుర్వార్త విని బ్రతుకజాలరు . ౨౬౩

ఈ ఘోరమునకు కారణమైతిని
నాకు మరణమే శరణ్యమని .
మారుతి వగచె తా చేసిన పనిగని
తన కోపమే తన శత్రువాయెనని . ౨౬౪

శ్రీరఘురాముని ప్రియసతి సీత
అగ్ని వంటి మహా పతివ్రత .
అగ్నిని అగ్ని దహింపనేర్చునా ?
అయోనిజను అగ్ని దహించునా ?౨౬౫

నను కరుణించిన అగ్ని దేవుడు
సీతను చల్లగ చూడకుండునా ?
అని హనుమంతుడు తలచుచుండగా
శుభ శకునములు తోచె ప్రీతిగా . ౨౬౬

యెల్ల రాక్షసుల సిరి సంపదలు
మంటల పాలై దహనమాయెనని .
అశోక వనము ధ్వంసమైనను
జానకి మాత్రము క్షేమమేనని . ౨౬౭

లంకాపురము రూపుమాసినను
విభీషణు గృహము నిలిచి యుండెనని .
అంబర వీధిని సిద్ధచారణులు
పలుకగా విని మారుతి పొంగెను . ౨౬౮ | శ్రీ హనుమాను |

అశోక వనము మారుతి చేరెను
ఆనందాశ్రుల సీతను గాంచెను .
తల్లీ ! నీవు నా భాగ్యవశమున
క్షేమముంటివని పదముల వ్రాలెను . ౨౬౯

పోయి వత్తునిక సెలవునిమ్మని
అంజలి ఘటించి చెంత నిలచెను .
సీతా మాత హనుమంతునితో
ప్రీతిగ పలికెను ఆనందముతో . ౨౭౦

హనుమా ! అతులిత బలధామా !
శత్రుకర్శణా ! శాంతినిదానా !
యిందుండి నన్ను యీ క్షణమందే
కొనిపోగల సమర్థుడవీవే . ౨౭౧

రాముని వేగమె తోడ్కొని రమ్ము
రాక్షస చెర నాకు తొలిగింపుము .
అని పల్కె సీత హనుమంతునితో
సంపూర్ణమైన విశ్వాసముతో . ౨౭౨

తల్లీ ! నిన్ను చూచినదాదిగ
త్వరపడుచుంటిని మరలిపోవగా .
భీతినొందకుము నెమ్మదినుండుము
త్వరలో నీకు శుభములు కలుగు . ౨౭౩

రామలక్ష్మణ సుగ్రీవాదులను
అతి శీఘ్రముగా కొనిరాగలను .
అని మారుతి సీత పదముల వ్రాలె
సెలవుగైకొని రివ్వున మరలె . ౨౭౪ | శ్రీ హనుమాను |

అరిష్టమను గిరిపై నిలిచి
మారుతి యెగసెను కాయము పెంచి .
పవనకుమారుని పదఘట్టనకే
పర్వతమంతయు పుడమిని కృంగె . ౨౭౫

సీతను గాంచిన శుభవార్త వేగ
శ్రీరామునకు తెలియచేయగ .
మారుతి మరలెను అతి వేగముగ
ఉత్తర దిశగా వారిధి దాటగ . ౨౭౬

గరుడుని వోలె శరవేగము గొని
పెద్ద పెద్ద మేఘాలు దాటుకొని .
మార్గ మధ్యమున మైనాకుని గని
ప్రేమ మీరగా క్షేమము కనుగొని . ౨౭౭

దూరము నుండి మహేంద్ర శిఖరిని
ఉత్సాహమున ముందుగా గని .
విజయ సూచనగ గర్జన సేయుచు
మారుతి సాగెను వేగము పెంచుచు . ౨౭౮

సుందరమైన మహేంద్రగిరి పైన
సెలయేట దిగి తానమాడి .
జాంబవదాది పెద్దలందరికి
వాయునందనుడు వందనములిడి . ౨౭౯

చూచితి సీతను ! చూచితి సీతను !
అను శుభవార్తను ముందుగ పలికెను .
కపి వీరులు హనుమంతుని బొగడిరి
ఉత్సాహమున కిష్కింధకు సాగిరి . ౨౮౦

జాంబవదంగద హనుమదాదులు
ప్రస్రవణగిరి చేరుకొనినారు .
రామ లక్ష్మణ సుగ్రీవాదులకు
వినయముతో వందనమిడినారు . ౨౮౧

ఆంజనేయుడు శ్రీరామునితో
చూచితి సీతనని శుభవార్త తెల్పె .
చూడామణిని శ్రీరామునకిడి
అంజలి ఘటించి చెంతన నిలచె . ౨౮౨ | శ్రీ హనుమాను |

చూడామణిని రాముడు గైకొని
తన హృదయానికి చేర్చి హత్తుకొని .
మాటలు రాని ఆనందముతో
అశ్రులు నిండిన నయనాలతో . ౨౮౩

హనుమా ! సీతను యెట్లు గాంచితివి
యెట్లున్నది సీత, యేమి తెల్పినది ?
అని పలికిన శ్రీరామచంద్రునకు
మారుతి తెల్పె తన లంకా యానము . ౨౮౪

శత యోజనముల వారిధి దాటి
లంకాపురమున సీతను గాంచితి .
రాలు కరుగగా సీత పలుకగ
నా గుండెల క్రోధాగ్ని రగులగ . ౨౮౫

అసురుల గూల్చితి లంక దహించితి
రావణునితో సంవాదము సల్పితి .
అని మారుతి తన లంకా యానమును
రామచంద్రునకు విన్నవించెను . ౨౮౬

నిరతము నిన్నే తలచుచున్నది
క్షణమొక యుగముగ గడుపుచున్నది .
రెండు నెలల గడువు తీరక మునుపే
వేగమె వచ్చి కాపాడుమన్నది . ౨౮౭

రామలక్ష్మణ సుగ్రీవాదులకు
సీత క్షేమమని తెలుపమన్నది .
అని మారుతి తన లంకా యానమును
రామచంద్రునకు విన్నవించెను . ౨౮౮

రామలక్ష్మణుల భుజముల నిడుకొని
వేగమె లంకకు గొని వత్తునని .
రామలక్ష్మణుల అగ్ని శరములకు
రావణాదులు కూలుట నిజమని . ౨౮౯

యెన్నో రీతుల సీతా మాతకు
ధైర్యము గొలిపి నే మరలి వచ్చితిని .
అని మారుతి తన లంకా యానమును
రామచంద్రునకు విన్నవించెను . ౨౯౦

అందరు కలసి అయోధ్యకు చేరి
ఆనందముగా సుఖించెదరని .
సీతారామ పట్టాభిషేకము
కనుల పండువుగ జరిగి తీరునని . ౨౯౧

యెన్నో రీతుల సీతా మాతకు
ధైర్యము గొలిపి నే మరలి వచ్చితిని .
అని మారుతి తన లంకా యానమును
రామచంద్రునకు విన్నవించెను . ౨౯౨

ఆనందముతో అశ్రులు జారగ
సీతామాత నను దీవించగ .
పదముల వ్రాలి నే పయనమైతిని
పదములు రాక నే మరలి వచ్చితిని . ౨౯౩

ఒప్పలేదు కాని యెపుడో తల్లిని
భుజముల నిడుకొని కొనిరాకుందునా ?
అని మారుతి తన లంకా యానమును
రామచంద్రునకు విన్నవించెను . ౨౯౪ | శ్రీ హనుమాను |

సీత క్షేమమను శుభవార్త నేడు
మారుతి నాకు తెలుపకుండిన .
నేటి తోడ మా రఘుకులమంతా
అంతరించి యుండెడిది కదా ! ౨౯౫

మమ్మీ తీరుగ ఉద్ధరించిన
మారుతికి యేమివ్వగలనని .
సర్వమిదేనని కౌగిట జేర్చెను
హనుమంతుని ఆజానుబాహుడు . ౨౯౬ | శ్రీ హనుమాను |

నలుగురు శ్రద్ధతో ఆలకించగ
నలుగురు భక్తితో ఆలపించగ .
సీతారామహనుమానులు సాక్షిగ
సర్వజనులకు శుభములు కలుగగ . ౨౯౭

కవి కోకిల వాల్మీకి పలికిన
రామాయణమును తేట తెలుగున .
శ్రీ గురు చరణా సేవా భాగ్యమున
పలికెద సీతారామ కథ . ౨౯౮ | శ్రీ హనుమాను |

మంగళ హారతి గొను హనుమంతా
సీతారామ లక్ష్మణ సమేతా
నా అంతరాత్మ నిలుమో అనంతా
నీవే అంతా శ్రీ హనుమంతా .


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

9 thoughts on “Sundaradasu (Sri MS Rama Rao) Sundarakanda Part 2 – సుందరదాసు సుందరకాండ (ద్వితీయ భాగం)

  1. Hi Team, I guess there are more stanzas in between while Dr. P Srinivas garu is singing in Bhakthi TV sundarakanda program. Could you please check and add those. We are really looking forward for the complete lyrics which was not available anywhere. Thankyou.

  2. రామాయణంలోని అద్భుతమైన సుందరకాండను చదివి ఇంకోసారి గుర్తుకు తెచ్చుకుని ధన్యుడనయ్యాను, ములాగ్రంథమైన వాల్మీకి రామాయణం నుండి తెలుగులో ఇక్కడ పోయిందుపరిచినందుకు మికు నా కృతజ్ఞతలు……

స్పందించండి

error: Not allowed