Endaro Mahanubhavulu – ఎందరో మహానుభావులు


ఎందరో మహానుభావులు
అందరికీ వందనములు ||

చందురు వర్ణుని అంద చందమును హృదయార-
విందమున జూచి బ్రహ్మానందమనుభవించు
వారెందరో మహానుభావులు |

సామ గాన లోల మనసిజ లావణ్య ధన్య
మూర్ధన్యులెందరో మహానుభావులు |

మానస వన చర వర సంచారము నెరిపి
మూర్తి బాగుగ పొగడనే వారెందరో మహానుభావులు |

సరగున పాదములకు స్వాంతమను సరోజమును
సమర్పణము సేయు వారెందరో మహానుభావులు |

పతిత పావనుడనే పరాత్పరుని గురించి
పరమార్థమగు నిజ మార్గముతోను
బాడుచును సల్లాపముతో స్వర లయాది
రాగముల దెలియు వారెందరో మహానుభావులు |

హరి గుణ మణిమయ సరములు గలమున శోభిల్లు
భక్త కోటులిలలో తెలివితో చెలిమితో
కరుణ గల్గి జగమెల్లను సుధా దృష్టిచే బ్రోచు
వారెందరో మహానుభావులు |

హొయలు మీర నడలు గల్గు సరసుని సదా కనుల
జుచుచును పులక శరీరులై ఆనంద పయోధి
నిమగ్నులై ముదంబునను యశము గల
వారెందరో మహానుభావులు |

పరమ భాగవత మౌని వర శశి విభాకర సనక సనందన
దిగీశ సుర కింపురుష కనక కశ్యపు సుత నారద తుంబురు
పవనసూను బాలచంద్ర ధర శుక సరోజభవ భూసురవరులు
పరమ పావనులు ఘనులు శాశ్వతులు కమల భవ సుఖము
సదానుభవులు గాక ఎందరో మహానుభావులు |

నీ మేను నామ వైభవంబులను నీ పరాక్రమ ధైర్యముల శాంత మానసము నీవుయను
వచన సత్యమును, రఘువర నీయెడ సద్భక్తియు జనించకను దుర్మతములను కల్ల
జేసినట్టి నీమది నెరింగి సంతసంబునను గుణ భజనా-నంద కిర్తనము జేయు వారెందరో మహానుభావులు |

భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణము మర్మములను
శివాది షణ్మతముల గూఢములన్ ముప్పది ముక్కోటి సురాంతరంగముల
భావంబుల నెరిగి భావ రాగ లయాది సౌఖ్యముచే చిరాయువుల్ గలిగి
నిరవధి సుఖాత్ములై త్యాగరాజాప్తులైన వారెందరో మహానుభావులు |

ప్రేమ ముప్పిరి గొన్న వేళ నామము దలచేవారు
రామభక్తుడైన త్యాగరాజనుతుని నిజ దాసులైన
వారెందరో మహానుభావులు |

అందరికీ వందనములు

ఎందరో మహానుభావులు
అందరికీ వందనములు ||


గమనిక: "నవగ్రహ స్తోత్రనిధి" పుస్తకము తాయారుచేయుటకు ఆలోచన చేయుచున్నాము.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments

2 thoughts on “Endaro Mahanubhavulu – ఎందరో మహానుభావులు

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు.

error: Not allowed