Read in తెలుగు / ಕನ್ನಡ / தமிழ் / देवनागरी / English (IAST)
(గమనిక: ఈ స్తోత్రము “శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో కూడా ఉన్నది. Click here to buy.)
(ఈ కవచం భైరవ మూర్తి (శివుడు) తన ప్రాణవల్లభ అయిన భైరవికి (పార్వతికి) ఉపదేశించినది. శత్రు నాశనం కోసం, అశుభాల తొలగింపు కోసం మరియు యుద్ధ, వివాద సమయాల్లో రక్షణ కోసం ఈ దివ్య కవచం ఉద్దేశించబడింది. దీనిని పఠించడం వల్ల త్రైలోక్య విజయం సిద్ధిస్తుంది. విపత్తులు, భయాల నుండి రక్షణ లభించడమే కాకుండా, భక్తితో పఠించే వారికి సర్వార్థ సిద్ధులు కలుగుతాయి.)
శ్రీభైరవీ ఉవాచ |
శ్రుత్వా చ బగళాపూజాం స్తోత్రం చాపి మహేశ్వర |
ఇదానీం శ్రోతుమిచ్ఛామి కవచం వద మే ప్రభో || ౧ ||
వైరినాశకరం దివ్యం సర్వాఽశుభవినాశనమ్ |
శుభదం స్మరణాత్ పుణ్యం త్రాహి మాం దుఃఖనాశనమ్ || ౨ ||
భైరవీ దేవి పలికెను: “ఓ మహేశ్వరా! బగళాముఖీ దేవి పూజా విధానాన్ని, స్తోత్రాన్ని విన్నాను. ఇప్పుడు శత్రువులను నాశనం చేసేది (వైరినాశకరం), దివ్యమైనది, అన్ని అశుభాలను పోగొట్టేది, స్మరించినంతనే పుణ్యాన్ని, శుభాలను ఇచ్చేది మరియు దుఃఖాలను హరించేది అయిన ‘కవచాన్ని’ నాకు ఉపదేశించి రక్షించుము ప్రభో!”
శ్రీభైరవ ఉవాచ |
కవచం శృణు వక్ష్యామి భైరవి ప్రాణవల్లభే |
పఠిత్వా ధారయిత్వా తు త్రైలోక్యే విజయీ భవేత్ || ౩ ||
భైరవుడు పలికెను: “ఓ ప్రాణవల్లభవైన భైరవీ! వినుము, ఆ కవచాన్ని చెబుతాను. దీనిని పఠించినా లేదా ధరించినా (రాసి దగ్గర ఉంచుకున్నా) సాధకుడు ముల్లోకాలలో విజయుడు అవుతాడు.”
అస్య శ్రీబగళాముఖీకవచస్య నారద ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీబగళాముఖీ దేవతా లం బీజం ఈం శక్తిః ఐం కీలకం పురుషార్థచతుష్టయే జపే వినియోగః ||
(వినియోగం: ఈ కవచానికి నారదుడు ఋషి, అనుష్టుప్ ఛందస్సు, బగళాముఖీ దేవత, లం బీజం, ఈం శక్తి, ఐం కీలకం. చతుర్విధ పురుషార్థాల సిద్ధి కోసం దీనిని వినియోగిస్తున్నాను.)
అథ కవచమ్ |
శిరో మే బగళా పాతు హృదయమేకాక్షరీ పరా |
ఓం హ్రీం ఓం మే లలాటే చ బగళా వైరినాశినీ || ౪ ||
నా శిరస్సును బగళా దేవి, నా హృదయమును ఏకాక్షరీ మంత్ర రూపిణి అయిన పరాశక్తి రక్షించుగాక. శత్రువులను నాశనం చేసే బగళా దేవి ‘ఓం హ్రీం ఓం’ మంత్ర రూపంలో నా నుదుటిని (లలాటే) రక్షించుగాక.
గదాహస్తా సదా పాతు ముఖం మే మోక్షదాయినీ |
వైరిజిహ్వాధరా పాతు కంఠం మే బగళాముఖీ || ౫ ||
చేతిలో గదను ధరించిన మోక్షదాయినీ దేవి ఎల్లప్పుడూ నా ముఖమును రక్షించుగాక. శత్రువు యొక్క నాలుకను పట్టుకున్న బగళాముఖీ దేవి నా కంఠమును రక్షించుగాక.
ఉదరం నాభిదేశం చ పాతు నిత్యం పరాత్పరా |
పరాత్పరతరా పాతు మమ గుహ్యం సురేశ్వరీ || ౬ ||
పరాత్పర స్వరూపిణి నా కడుపును (ఉదరం) మరియు బొడ్డు (నాభి) ప్రదేశాన్ని నిత్యం రక్షించుగాక. దేవతలకు ఈశ్వరి అయిన ఆమె నా గుహ్య భాగమును (రహస్య అవయవములను) రక్షించుగాక.
హస్తౌ చైవ తథా పాతు పార్వతీ పరిపాతు మే |
వివాదే విషమే ఘోరే సంగ్రామే రిపుసంకటే || ౭ ||
పార్వతీ దేవి నా రెండు చేతులను రక్షించుగాక. వాదవివాదాలలో, భయంకరమైన కష్ట కాలంలో, యుద్ధంలో (సంగ్రామే) మరియు శత్రువుల వల్ల కలిగే ఆపదలలో ఆమె నన్ను రక్షించుగాక.
పీతాంబరధరా పాతు సర్వాంగం శివనర్తకీ |
శ్రీవిద్యా సమయం పాతు మాతంగీ పూరితా శివా || ౮ ||
పసుపు వస్త్రాలు ధరించిన శివనర్తకి నా అన్ని అవయవాలను (సర్వాంగం) రక్షించుగాక. శ్రీవిద్యా స్వరూపిణి, మాతంగీ రూపంలో ఉన్న మంగళప్రదాయిని అయిన శివ నా సమయాన్ని (జీవిత కాలమును) రక్షించుగాక.
పాతు పుత్రం సుతాం చైవ కళత్రం కాళికా మమ |
పాతు నిత్యం భ్రాతరం మే పితరం శూలినీ సదా || ౯ ||
కాళికా దేవి నా కుమారుడిని, కుమార్తెను మరియు భార్యను (కళత్రం) రక్షించుగాక. శూలమును ధరించిన శూలినీ దేవి నా సోదరుడిని (భ్రాతరం) మరియు తండ్రిని (పితరం) ఎల్లప్పుడూ రక్షించుగాక.
రదే హి బగళాదేవ్యాః కవచం మన్ముఖోదితమ్ |
న వై దేయమముఖ్యాయ సర్వసిద్ధిప్రదాయకమ్ || ౧౦ ||
నా ముఖం నుండి వెలువడిన ఈ బగళా దేవి కవచం అత్యంత రహస్యమైనది. సర్వ సిద్ధులను ఇచ్చే ఈ కవచాన్ని భక్తి లేని వారికి, అర్హత లేని వారికి (అముఖ్యాయ) ఎన్నటికీ ఇవ్వకూడదు.
పఠనాద్ధారణాదస్య పూజనాద్వాంఛితం లభేత్ |
ఇదం కవచమజ్ఞాత్వా యో జపేద్బగళాముఖీమ్ || ౧౧ ||
దీనిని పఠించడం వల్ల, ధరించడం వల్ల లేదా పూజించడం వల్ల కోరుకున్న కోరికలు (వాంఛితం) నెరవేరుతాయి. ఈ కవచం తెలియకుండా (పఠించకుండా) ఎవరైతే బగళాముఖీ మంత్రాన్ని జపిస్తారో, …
పిబంతి శోణితం తస్య యోగిన్యః ప్రాప్య సాదరాః |
వశ్యే చాకర్షణే చైవ మారణే మోహనే తథా || ౧౨ ||
… యోగినులు వారి రక్తమును (శోణితం) తాగుతారు (అనగా కవచ రక్షణ లేని జపం ప్రమాదకరం లేదా నిష్ఫలం అని అర్థం). వశీకరణం, ఆకర్షణ, మారణ, మోహన ప్రక్రియల సమయంలో …
మహాభయే విపత్తౌ చ పఠేద్వా పాఠయేత్ తు యః |
తస్య సర్వార్థసిద్ధిః స్యాద్భక్తియుక్తస్య పార్వతీ || ౧౩ ||
… మరియు గొప్ప భయం కలిగినప్పుడు, ఆపదలు (విపత్తౌ) వచ్చినప్పుడు ఈ కవచాన్ని పఠించేవారికి లేదా పఠింపజేసేవారికి సమస్త కార్యాలు సిద్ధమువుతాయి. ఓ పార్వతీ! భక్తితో కూడిన సాధకుడికి ఇది సర్వార్థ సిద్ధిని కలిగిస్తుంది.
ఇతి శ్రీరుద్రయామలే వైరినాశకర శ్రీ బగళాముఖీ కవచమ్ ||
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము మరియు తాత్పర్యం ఈ క్రింది పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ బగళాముఖీ స్తోత్రాలు చూడండి.
మా ప్రచురణ: "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి (తాత్పర్య సహితం)" ప్రింటింగు పూర్తి అయి కొనుగోలుకు సిద్ధంగా ఉంది.
స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Support this Dharma Karya : If you find value in the Stotranidhi collection, please consider supporting this work. You can make a contribution through these links - PhonePe/GooglePay/BHIM (within India) or Paypal (outside India)
Buy Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".
విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.
Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.