Site icon Stotra Nidhi

Sri Satyanarayana Vrata kalpam – శ్రీ సత్యనారాయణ వ్రతకల్పం

 

Read in తెలుగు

Part 1  శ్రీ సత్యనారాయణ వ్రతకల్పం

Part 2  శ్రీ సత్యనారాయణ పూజ

శ్రీ సత్యనారాయణ వ్రతము స్కాంద పురాణములోని రేవాఖండములో సూతమహాముని తెలిపినట్టు ఉంది.

వ్రతం ఎప్పుడు చేయాలి?
శ్రీ సత్యనారాయణ వ్రతము పూర్ణిమ నాడు కానీ, ఏకాదశి నాడు కానీ చేయుట శ్రేష్ఠము. కార్తీక పూర్ణిమ, వైశాఖ పూర్ణిమ, మాస సంక్రాంతి రోజులలో చేస్తే విశేష ఫలితం కలుగుతుంది. ఇవి కాక ఏ రోజు అయినా కూడా చేయవచ్చు.

వ్రతముకు కావలసిన సామాగ్రి –
– మనస్సులో ధృడ సంకల్పం
– పసుపు, కుంకుమ, గంధం
– శ్రీ సత్యనారాయణ స్వామి వారి చిన్న రూపు మరియు చిత్రపటం
– బియ్యం (౧ కేజీ)
– తమలపాకులు (వంద)
– వక్కలు (యాభై)
– రూపాయి బిళ్ళలు (నలభై)
– ఎండు ఖర్జూర (యాభై)
– కొబ్బరికాయలు (ఎనిమిది)
– పసుపు కలిపిన అక్షతలు
– పూలమాలలు, విడి పువ్వులు, మామిడి ఆకులు
– తులసీ దళములు
– కలశం కింద పెట్టడానికి తెలుపు లేక పసుపు రంగు వస్త్రం
– కలశం పైన పెట్టడానికి ఎరుపు వస్త్రం
– ప్రధాన కలశానికి పెద్ద చెంబు, ఉపకలశానికి చిన్న చెంబు, అందులో మంచి నీళ్ళు
– పంచపాత్ర (పాత్ర, అరివేణం, ఉద్ధరిణ), అందులో మంచి నీళ్ళు
– అభిషేకానికి పంచామృతాలు – ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, చక్కెర (పంచదార), కొబ్బరినీళ్ళు, పండ్ల రసాలు
– అగరవత్తులు, లేక సాంబ్రాణి, అవి పెట్టడానికి ఒక స్టాండు (ధూపం అన్నప్పుడు వెలిగించాలి)
– దీపం కుందులు (ప్రమిదలు), నూనె, వత్తులు (దీపాలను వెలిగించడానికి సిద్ధంగా తయారుచేసి ప్రక్కన ఉంచుకోవాలి)
– నైవేద్యానికి నూకప్రసాదం, పండ్లు మరియు అప్పుడే వండిన సాత్త్విక ఆహార పదార్థాలు
– తమలపాకులు, వక్కలు, దొరికితే చిటికెడు పచ్చ కర్పూరం (తాంబూలం కోసం)
– హారతి కర్పూరం, హారతి పళ్ళెం
– వెలిగించుకోడానికి ఒక అగ్గిపెట్టె
– ఘంట
– పంచాంగం (మాసం, అయనం, తిథి, నక్షత్రం చూసుకోవడానికి)
– చేయి తుడుచుకోవడానికి శుభ్రమైన వస్త్రం
– కూర్చోవడానికి దర్భాసనంగానీ, పీటగానీ, అంచు ఉన్న తెల్లటి వస్త్రంగానీ

వ్రతం ఎలా చేయాలి?
వ్రతము చేయ సంకల్పించిన రోజు మొత్తము శ్రీ సత్యనారాయణ స్వామిని తలుచుకుంటూ ఉండాలి. ప్రొద్దున నుండి ఉపవాసం ఉండి, సాయంత్రం వ్రతం చేసుకోవాలి. గృహముయొక్క ప్రధాన ద్వారమునకు మామిడాకులు కట్టి, గుమ్మనికి పసుపు కుంకుమతో బొట్టు పెట్టి, వీలైతే గుమ్మం బయట గోమయంతో అలికి బియ్యపు పిండితో మంచి ముగ్గులు పెట్టాలి.

వ్రతము చేయ సంకల్పించిన ప్రదేశముని శుభ్రపరిచి అక్కడ తెల్లటి వస్త్రమును పరచి, దాని మీద బియ్యము పోసి ఒక పీఠము తయారు చేయాలి. దాని మధ్యలో ప్రధాన కలశం చెంబు పెట్టాలి. దానిలో నీళ్ళు పోసి, మామిడాకులు వేసి, వాటిపై ఒక కొబ్బరికాయ పెట్టి, దాని పై నూతన వస్త్రాన్ని శంఖం ఆకారంలో చుట్టి పెట్టాలి. గంధం కుంకుమ పెట్టాలి. శ్రీ సత్యనారాయణ స్వామి చిత్రపటాన్ని ప్రధాన కలశం వెనుకగా పెట్టి, గంధం కుంకుమ పెట్టి, పూలతో అలంకారం చేయాలి.

ముందుగా పూర్వాంగం చేసి, సంకల్పం చెప్పి, ఉపకలశ పూజ చేసి, పసుపు గణపతి పూజ చేయాలి.

తరువాత పరివార దేవత అర్చన ఉంటుంది. వరుణ పూజ ప్రధాన కలశం మీద చేయాలి. పంచలోక పాలక పూజ, నవగ్రహ పూజ, అష్టదిక్పాలక పూజలు ప్రధాన కలశానికు చుట్టూ చేయాలి. ఒకొక్క పరివార దేవతను ఆవాహనం చేయుటకు ఒక తమలపాకు, ఒక వక్క, ఒక పువ్వు తీసుకుని ప్రధాన కలశం చుట్టూ నిర్ణీత స్థానాలలో పెట్టాలి.

పంచలోకపాలక స్థానాలు ||

( ఉత్తర దిక్కు )
 |---------------------------------------------|
 | గణపతి - బ్రహ్మ - విష్ణు - రుద్ర - గౌరీ          |
 |
 |
 |                                 (*)
 |
 |
 |---------------------------------------------|

నవధాన్యాలకు స్థానాలు ||

(ఉత్తర దిక్కు)
 |----------------------------------------------------|
 | ఉలవలు           శనగలు                  పెసలు
 | (కేతు)            (బృహస్పతి)           (బుధ)
 |
 | నువ్వులు          గోధుమలు               బొబ్బర్లు
 | (శని)              (రవి)                      (శుక్ర)
 |
 | మినుములు      కందులు                బియ్యం |
 | (రాహు)          (అంగారక)              (చంద్ర) |
|----------------------------------------------------|

అధిదేవత ప్రత్యధిదేవతా సహిత నవగ్రహ స్థానాలు ||

( ఉత్తర దిక్కు )
 |-----------------------------------------------|
 | (బ్రహ్మా)           (ఇంద్ర)          (నారాయణ)
 | కేతు              బృహస్పతి           బుధ 
 | (చిత్రగుప్త)          (బ్రహ్మ)           (విష్ణు)
 |
 |
 |                      (*)
 | (ప్రజాపతి)           (రుద్ర)      (ఇంద్రమరుత్వ)
 | శని                  రవి            శుక్ర 
 | (యమ)             (అగ్ని)       (ఇంద్రాణీం)
 |
 |
 | (సర్పం)          (క్షేత్రపాలక)          (గౌరీ) 
 | రాహు              అంగారక           చంద్ర 
 | (గాం)             (పృథివీ)           (అపః)
 |-----------------------------------------------|

అష్టదిగ్పాలక స్థానాలు |

( ఉత్తర దిక్కు )
 |-----------------------------------------------|
 | వాయు             కుబేర             ఈశాన
 |
 | వరుణ              (*)             ఇంద్రం
 |
 | నిర్‍ఋతి          యమ              అగ్ని 
 |-----------------------------------------------|

ఇలా పరివార దేవతలకు అర్చన చేసిన తరువాత శ్రీ సత్యనారాయణ స్వామికి షోడశోపచార పూజ చేయాలి. పూజ అయ్యాక ఒక పండు స్వామి వారి వద్ద ఉంచి కథలు చదువుకోవాలి. తరువాత స్వామి వారికి హారతి ఇచ్చి ప్రసాదం స్వీకరించాలి. దీనితో వ్రతం పూర్తవుతుంది.

గమనిక: సంపూర్ణ సత్యనారాయణ వ్రతం మరియు కథలు Stotra Nidhi మొబైల్ యాప్ లో ఉన్నాయి. యాప్ స్టోర్, ప్లే స్టోర్ లేదా విండోస్ స్టోర్ నుంచి డౌన్‍లోడ్ చేసుకోండి.


మరిన్ని వ్రతములు చూడండి.


గమనిక: ఉగాది నుండి మొదలయ్యే వసంత నవరాత్రుల కోసం "శ్రీ లలితా స్తోత్రనిధి" పారాయణ గ్రంథము అందుబాటులో ఉంది.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments