Site icon Stotra Nidhi

Sri Sankata Nasana Ganesha Stotram (with Telugu Meaning) – శ్రీ సంకటనాశన గణేశ స్తోత్రం

 

Read in తెలుగు

// శ్లోకాలు – తాత్పర్యం //

నారద ఉవాచ |
ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకమ్ |
భక్తావాసం స్మరేన్నిత్యమాయుష్కామార్థసిద్ధయే || ౧ ||

నారద ఉవాచ: గౌరీపుత్రుడైన వినాయకుడికి తలవంచి నమస్కరించి, భక్తుల హృదయాల్లో నివసించే ఆ స్వామిని ఆయుష్షు, కోరికలు, మరియు సంపద సిద్ధించుటకై ప్రతిరోజూ స్మరించాలి.

ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకమ్ |
తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకమ్ || ౨ ||

లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ |
సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టమమ్ || ౩ ||

నవమం భాలచంద్రం చ దశమం తు వినాయకమ్ |
ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననమ్ || ౪ ||

గణపతి 12 దివ్య నామాలు :
1. వక్రతుండ: వంకరగా ఉన్న తొండము కలవాడు.
2. ఏకదంత: ఒకే దంతము కలవాడు.
3. కృష్ణపింగాక్ష: నల్లని, ఎర్రని కన్నులు కలవాడు.
4. గజవక్త్ర: ఏనుగు ముఖము కలవాడు.
5. లంబోదర: పెద్ద ఉదరము (పొట్ట) కలవాడు.
6. వికట: విలక్షణమైన, భయంకరమైన రూపం కలవాడు (శత్రువుల పట్ల).
7. విఘ్నరాజ: విఘ్నాలను (ఆటంకాలను) తొలగించే ప్రభువు.
8. ధూమ్రవర్ణ: పొగ రంగు వంటి దేహచ్ఛాయ కలవాడు.
9. ఫాలచంద్ర: నుదుటిపై చంద్రుడిని ధరించినవాడు.
10. వినాయక: సర్వశ్రేష్ఠుడైన నాయకుడు.
11. గణపతి: ప్రమథ గణాలకు అధిపతి.
12. గజానన: ఏనుగు ముఖముతో ప్రకాశించేవాడు.

ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః |
న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం పరమ్ || ౫ ||

ఈ పన్నెండు నామాలను మూడు కాలాలలో (ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం) పఠించేవారికి ఎటువంటి విఘ్న భయము ఉండదు. వారికి అన్ని పనులలో విజయం సిద్ధిస్తుంది.

విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనమ్ |
పుత్రార్థీ లభతే పుత్రాన్మోక్షార్థీ లభతే గతిమ్ || ౬ ||

విద్య కావాలనుకునే వారికి విద్య లభిస్తుంది. ధనం కావాలనుకునే వారికి ధనం ప్రాప్తిస్తుంది. సంతానం కోరుకునే వారికి సంతానం కలుగుతుంది. మోక్షం కోరుకునే వారికి ముక్తి లభిస్తుంది.

జపేద్గణపతిస్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ |
సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః || ౭ ||

ఈ స్తోత్రాన్ని నిత్యం జపిస్తే 6 నెలల్లో ఫలితం కనిపిస్తుంది. ఒక సంవత్సరం పాటు జపిస్తే సంపూర్ణ సిద్ధి లభిస్తుంది, ఇందులో ఎటువంటి సందేహం లేదు. (వినాయక చవితి లేదా సంకష్టహర చతుర్థి రోజున ఈ స్తోత్రాన్ని పఠించడం విశేష ఫలితాలనిస్తుంది.)

అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్ |
తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః || ౮ ||

ఈ స్తోత్రాన్ని రాసి ఎనిమిది మంది బ్రాహ్మణులకు సమర్పించిన వారికి, గణేశుని అనుగ్రహంతో సకల విద్యలు లభిస్తాయి.

ఇతి శ్రీనారదపురాణే సంకష్టనాశనం నామ గణేశ స్తోత్రమ్ |


మరిన్ని శ్రీ గణేశ స్తోత్రాలు చూడండి.

మా తదుపరి ప్రచురణ: తెలుగు తాత్పర్యాలతో "శ్రీ బగళాముఖీ స్తోత్రనిధి" పుస్తకము ముద్రించుటకు ఆలోచన చేయుచున్నాము.

స్తోత్రనిధి (తెలుగు) వాట్సాప్ ఛానల్ : మా వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి : మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం లక్ష జపం చేయండి. మీకు అతిదగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజూ వెళ్ళి అక్కడి దేవత మంత్రాన్ని కనీసం 108 జపంచేసి, ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది.

Important message to Dharmikas : Please visit your nearest Devalayam and chant mantra of that Devata atleast 108 times daily in that temple. When Devata becomes powerful, it will automatically protect Dharma.

Prabhata Stotranidhi Book: A single book with important stotras of Devatas is available in 4 languages - "తెలుగు" , "ಕನ್ನಡ" , "देवनागरि" , "English (IAST)".

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments