Read in తెలుగు / English (IAST)
[గమనిక: ఈ స్తోత్రము “శ్రీ సాయి స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో ఉన్నది. Click here to buy.]
షిరిడీసదనా శ్రీసాయీ
సుందర వదనా శుభధాయీ
జగత్కారణా జయసాయీ
నీ స్మరణే ఎంతో హాయీ || ౧ ||
శిరమున వస్త్రము చుట్టితివీ
చినిగిన కఫినీ తొడిగితివీ
ఫకీరువలె కనిపించితివీ
పరమాత్ముడవనిపించితివీ || ౨ ||
చాందుపాటేలుని పిలిచితివీ
అశ్వము జాడ తెలిపితివీ
మహల్సాభక్తికి మురిసితితివీ
సాయని పిలిచితె పలికితివీ || ౩ ||
గోధుమ పిండిని విసరితివీ
కలరా వ్యాధిని తరిమితివీ
తుఫాను తాకిడి నాపితివీ
అపాయమును తప్పించితివీ || ౪ ||
అయిదిళ్లలో భిక్షడిగితివీ
పాపాలను పరిమార్చితివీ
బైజాసేవను మెచ్చితివీ
సాయుజ్యమునూ ఇచ్చితివీ || ౫ ||
నీళ్ళను నూనెగ మార్చితివీ
దీపాలను వెలిగించితివీ
సూకరనైజం తెలిపితివీ
నిందలు వేయుట మాన్పితివీ || ౬ ||
ఊదీ వైద్యము చేసితివీ
వ్యాధులనెన్నో బాపితివీ
సంకీర్తన చేయించితివీ
చిత్తశాంతి చేకూర్చితివీ || ౭ ||
అల్లా నామము పలికితివీ
ఎల్లరి క్షేమము కోరితివీ
చందనోత్సవము చేసితివీ
మతద్వేషాలను మాపితివీ || ౮ ||
కుష్ఠురోగినీ గాంచితివీ
ఆశ్రయమిచ్చీ సాకితివీ
మానవధర్మం నెరిపితివీ
మహాత్మునిగ విలసిల్లితివీ || ౯ ||
ధునిలో చేతిని పెట్టితివీ
కమ్మరిబిడ్డను కాచితివీ
శ్యామా మొర నాలించితివీ
పాము విషము తొలిగించితివీ || ౧౦ ||
జానెడు బల్లను ఎక్కితివీ
చిత్రముగా శయనించితివీ
బల్లి రాకను తెలిపితివీ
సర్వజ్ఞుడవనిపించితివీ || ౧౧ ||
లెండీ వనమును పెంచితివీ
ఆహ్లాదమునూ పంచితివీ
కర్తవ్యము నెరిగించితివీ
సోమరితనమును తరిమితివీ || ౧౨ ||
కుక్కను కొడితే నొచ్చితివీ
నీపై దెబ్బలు చూపితివి
ప్రేమతత్వమును చాటితివీ
దయామయుడవనిపించితివీ || ౧౩ ||
అందరిలోనూ ఒదిగితివీ
ఆకాశానికి ఎదిగితివీ
దుష్టజనాళిని మార్చితివీ
శిష్టకోటిలో చేర్చితివీ || ౧౪ ||
మహల్సా ఒడిలో కొరిగితివీ
ప్రాణాలను విడనాడితివీ
మూడు దినములకు లేచితివీ
మృత్యుంజయుడనిపించితివీ || ౧౫ ||
కాళ్ళకు గజ్జెలు కట్టితివీ
లయ బద్ధముగా ఆడితివీ
మధుర గళముతో పాడితివీ
మహదానందము కూర్చితివీ || ౧౬ ||
అహంకారమును తెగడితివీ
నానావళినీ పొగడితివీ
మానవసేవా చేసితివీ
మహనీయుడవనిపించితివీ || ౧౭ ||
దామూ భక్తికి మెచ్చితివీ
సంతానమునూ ఇచ్చితివీ
దాసగణుని కరుణించితివీ
గంగాయమునలు చూపితివీ || ౧౮ ||
పరిప్రశ్నను వివరించితివీ
నానాహృది కదిలించితివీ
దీక్షితుని పరీక్షించితివీ
గురుభక్తిని ఇల చాటితివీ || ౧౯ ||
చేతిని తెడ్డుగ త్రిప్పితివీ
కమ్మని వంటలు చేసితివీ
ఆర్తజనాళిని పిలిచితివీ
ఆకలి బాధను తీర్చితివీ || ౨౦ ||
మతమును మార్చితె కసరితివీ
మతమే తండ్రని తెలిపితివీ
సకల భూతదయ చూపితివీ
సాయి మాతగా అలరితివీ || ౨౧ ||
హేమాదును దీవించితివీ
నీదు చరిత వ్రాయించితివీ
పారాయణ చేయించితివీ
పరితాపము నెడబాపితివీ || ౨౨ ||
లక్ష్మీబాయిని పిలిచితివీ
తొమ్మిది నాణెములిచ్చితివీ
నవవిధ భక్తిని తెలిపితివీ
ముక్తికి మార్గము చూపితివీ || ౨౩ ||
బూటీ కలలో కొచ్చితివీ
ఆలయమును కట్టించితివీ
తాత్యా ప్రాణము నిలిపితివీ
మహాసమాధీ చెందితివీ || ౨౪ ||
సమాధి నుండే పలికితివీ
హారతినిమ్మని అడిగితివీ
మురళీధరునిగ నిలిచితివీ
కరుణామృతమును చిలికితివీ || ౨౫ ||
చెప్పినదేదో చేసితివీ
చేసినదేదో చెప్పితివీ
దాసకోటి మది దోచితివీ
దశదిశలా భాసిల్లితివీ || ౨౬ ||
సకల దేవతలు నేవెనయా
సకల శుభములను కూర్చుమయా
సతతమునిను ధ్యానింతుమయా
సద్గురు మా హృదినిలువుమ్మయా || ౨౭ ||
సాయీ నక్షత్రమాలికా
భవరోగాలకు మూలికా
పారాయణ కిది తేలికా
ఫలమిచ్చుటలో ఏలికా
గమనిక: పైన ఇవ్వబడిన స్తోత్రము, ఈ పుస్తకములో కూడా ఉన్నది.
శ్రీ సాయి స్తోత్రనిధి
(నిత్య పారాయణ గ్రంథము)
మరిన్ని శ్రీ సాయిబాబా స్తోత్రాలు చూడండి.
గమనిక : మా తదుపరి ప్రచురణ "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" పుస్తకము ప్రింటు చేయుటకు ఆలోచన చేయుచున్నాము.
పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.
Chant other stotras in తెలుగు, ಕನ್ನಡ, தமிழ், देवनागरी, english.
Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.