Site icon Stotra Nidhi

Margasira Lakshmi Vara Vratham (Pooja Vidhanam, Vrata Katha) – మార్గశిర లక్ష్మివార వ్రతం

 

Read in తెలుగు

(గమనిక: ముందుగా పూర్వాంగం, పసుపు గణపతి పూజ, శ్రీమహాలక్ష్మి పూజ చేసి తరువాత ఈ కథ చదువుకుని, అక్షతలు అమ్మవారి మీద వేసి, అమ్మవారి పాదముల వద్ద అక్షతలు మీ తలపై వేసుకోవలెను.)

పూర్వాంగం చూ. ||

శ్రీ మహాగణపతి పూజ (పసుపు గణపతి పూజ) చూ. ||

శ్రీ మహాలక్ష్మీ విశేష షోడశోపచార పూజ చూ. ||

–  వ్రత కథ –

[గమనిక: ఈ వ్రతకథ “శ్రీ లక్ష్మీ స్తోత్రనిధి” పారాయణ గ్రంథములో లో కూడా ఉన్నది.]

పూర్వకాలమున సుశీల అను ఒక బాలిక కలదు. ఆమె చిన్నతనములో కన్నతల్లి కాలముచేసిన తరువాత తన తండ్రి వేరొక వివాహము చేసుకొనెను. వచ్చిన ఆ సవతి తల్లి సుశీలతో ఇంటిపనులు చేయించుచూ తను విశ్రాంతి తీసుకొనుచుండెను. కాలక్రమములో సుశీల సవతి తల్లికి ఒక పిల్లవాడు జన్మించినాడు. ప్రతిరోజు ఆ పిల్లవాడిని కూడా ఆడించమని సుశీలను పురమాయించి, బదులుగా ఒక చిన్న బెల్లపు ముక్క తినమని ఇస్తూ ఉండెను.

ఇంటిపనులు చేయుచూ మరియు శిశువుతో కష్టపడుచున్న సుశీల స్థితికి విచారించి, ఇరుగు పొరుగు వారు ఆమెను శ్రీమహాలక్ష్మిని ఆరాధింపుమని చెప్పిరి. ఆ మాటవినిన సుశీల మట్టితో శ్రీమహాలక్ష్మి యొక్క బొమ్మను చేసి, తన కన్నతల్లి వలె భావించి నిత్యము పూజించుచుండెను. తన సవతి తల్లి ఇచ్చిన బెల్లపు ముక్కను అమ్మవారికి నివేదన చేయుచుండెను.

కొంతకాలముకు సుశీలకు యుక్త వయస్సు వచ్చినది. తన తల్లిదండ్రులు ఆమెకు తగిన యువకునికిచ్చి వివాహము చేసిరి. ఆమె తన అత్తవారింటికి వెళుతూ తనతోపాటుగా నిత్యము పూజచేయు శ్రీమహాలక్ష్మి యొక్క బొమ్మను కూడా తీసుకుని వెళ్ళెను. అంతనా పుట్టింటిన గల సిరిసంపదలు కూడా సుశీల వెంట వెడలిపోయెను. అత్తింటివారు అకస్మాత్తుగా వృద్ధిచెందిన సిరిసంపదలు చూసి ఆశ్చర్యపడుచు, తమ కోడలి అదృష్టమును మెచ్చుకుని ఆమెను ఆప్యాయముగా చూసుకొనుచుండిరి.

కొంతకాలమునకు సుశీలకు తన పుట్టింటివారు దారిద్ర్యమును అనుభవించుచున్నారన్న తెలియవచ్చినది. వారికి సహాయము చేయదలచి తన భర్తను అడుగగా, అతను సమ్మతించెను. అంత తన సవతి తమ్ముడిని పిలిపించి, ఒక కర్రకు జోలె కట్టి, ఆ జోలెయందు బంగారునాణెములను పోసి ఇంటికి తీసుకువెళ్ళమని చెప్పెను. తన అక్క చేసిన సహాయానికి ఆనందభరితుడైన ఆ తమ్ముడు తిరుగుప్రయాణము చేసెను. మార్గమధ్యమున కాలకృత్యములు తీర్చుకుని చూసుకొనిన బంగారునాణెములు గల జోలెకర్ర కనిపించలేదు. ఎవరో దొంగతనము చేసినారని గ్రహించి, బాధతో తన ఇంటికి వెళ్ళిపోయెను.

తరువాత కొంతకాలమునకు ఆ తమ్ముడు సుశీలను కలువగా, సంభాషణ మధ్యలో తను బంగారునాణెముల జోలెను పోగొట్టుకొనిన విషయము చెప్పి దుఃఖించెను. అంతా ఆ సుశీల దిగులుచెందకుమని ఊరడించి, మరల సహాయము చేయదలచి, ఒక చెప్పుల జోడునిండా వరహాలు పోసి తన తండ్రికి ఇవ్వమని చెప్పెను. కాగా తిరుగుప్రయాణమున ఒక కుక్క వరహాలు కల ఆతని చెప్పును నోట కరచుకొని పారిపోయెను. మరల దుఃఖించుచూ అతను ఇంటికిచేరెను. కొంతకాలము తరువాత సుశీలకు ఈ విషయముకూడా తెలియవచ్చి, ఈసారి బాగా ఆలోచించి, తన తమ్ముడికి ఒక గుమ్మడికాయ నిండా రత్నాలు పోయించి తన సవతితల్లికి ఇవ్వమని చెప్పెను. ఆ తమ్ముడు తిరుగుప్రయాణమున ఒక చోటకూర్చుని చద్దితినుచుండ అక్కడకు వచ్చిన ఒక వ్యక్తి ఆ గుమ్మడికాయ దొంగతనము చేసి పారిపోయెను. ఇది గ్రహించిన ఆ తమ్ముడు బాధపడి, తన దురదృష్టమును నిందించుకొనుచు తిరిగి ఇంటికి చేరెను.

ఇట్లుండ, తన పుట్టింటివారిని చూడవలెనను కోరికగలిగి, సుశీల ఒకనాడు ఆమె పుట్టింటికి వెళ్ళెను. తన తమ్ముడి ద్వారా జరిగిన విషయములు తెలుసుకుని విచారించెను. తన పుట్టింటివారి దారిద్ర్యమును పోగొట్టుటకు యేమి చేయవలెనోయని తీవ్రముగా ఆలోచించి, తను నిత్యము పూజించు శ్రీమహాలక్షిని పూజించిన సంపదలు కలుగగలవని గ్రహించి తన సవతి తల్లిచే ఆ శ్రీమహాలక్ష్మి వ్రతము చేయుటకు నిశ్చయించుకున్నది. తన పుట్టింటివారిని తనతో పాటుగా అత్తవారింటికి తీసుకుని వెళ్ళినది.

ఇంతలో మార్గశిర మాసము ప్రారంభమై మొదటి లక్ష్మివారము వచ్చినది. నియమ నిష్ఠలతో సాయంకాలమున శ్రీమహాలక్ష్మి పూజ చేయవలసి ఉన్నదిగాన ఆరోజు యేమియును తినవద్దని సుశీల తన సవతి తల్లికి చెప్పెను. కాని ఆ సవతితల్లి పిల్లలకు భోజనముపెడుతూ ఆకలికి తట్టుకొనలేక తను కూడా చద్దన్నము తినెను. ఉపవాస దీక్షను ఆమె పాటించలేదు కనుక పూజ చేయరాదని, మరుసటి లక్ష్మివారము చేసెదమని సుశీల చెప్పెను.

రెండవ లక్ష్మివారపు సాయంత్రము ఆ సవతితల్లి స్నానము చేసుకుని తలకు నూనె రాసుకొనెను. ఇది అమంగళ సూచిక కనుక పూజను మరుసటివారము చేసెదమని సుశీల చెప్పెను. మూడవ లక్ష్మివారపు సాయంత్రం ఆ సవతితల్లి పిల్లలకు జడవేయుచూ, తను కూడా తలదువ్వుకొనెను. సంధ్యా సమయమున కేశాలంకరణ అమంగళకరము కనుక ఆ పనికి సుశీల విచారించెను. మరుసటి లక్ష్మివారము తన సవతితల్లిని నిష్ఠగా ఉంచతలచి, ఆమెను ఒక గృహమున కూర్చుండబెట్టి బయట గడియ వేసెను. కాసేపటికి అక్కడకు పిల్లలు ఆడుకొనుచూ వచ్చి అరటిపండు తిని, వాటి తొక్కలను ఆ గృహద్వారము వద్ద వేసిరి. ఆకలికి తట్టుకొనలేక ఆ సవతి తల్లి ఆ తొక్కలను తినెను. ఈ విషయము తెలిసి సుశీల బాధపడెను.

ఇంతలో ఆఖరి లక్ష్మివారము వచ్చెను. శ్రీమహాలక్ష్మి పూజకు శ్రేష్ఠమైన మార్గశిర మాసము వెడలిపోయిన మంచి అవకాశము చేజారిపోగలదని గ్రహించి, ఈసారి ఎటులనైనా తన సవతితల్లితో పూజ చేయించవలెనను పట్టుదలతో, వ్రత భంగము కాకుండా, తన తల్లి కొంగును తన చీర కొంగుతో ముడివేసుకుని, యే విధమైన నియమభంగము కలుగకుండా జాగ్రత్తపడినది. ఆనాటి సాయంత్రము తనతోపాటు, తన సవతితల్లితో కూడా శ్రీమహాలక్ష్మి పూజ చేయించెను.

పూజాంతమున ప్రసన్నురాలైన శ్రీమహాలక్ష్మి, సుశీల పెట్టిన నివేదనను స్వీకరించి, ఆ సవతి తల్లి పెట్టిన నివేదనను తిరస్కరించినది. భక్తి శ్రద్ధలతో సుశీల ఇది యేమని అడుగగా ఆ శ్రీమహాలక్ష్మి, “ఓ సుశీలా, నీ చిన్నతనమున నువ్వు నా పూజచేయునపుడు ఈ నీ సవతితల్లి కోపగించి, చీపురుతో నిన్ను కొట్టినది. ఆ దోషము వలన నేను ఆమె నివేదనము స్వీకరింపలేను” అని చెప్పెను. దానికి ఆ సుశీల తన సవతితల్లి చేసిన పనిని మన్నింపుమని ప్రార్థింపగా, అటులనే యని అమ్మవారు పలికి నివేదనము స్వీకరించి, వారిరువురి ఇంట సుఖసంపదలు వృద్ధి చెందగలవని వరము ఇచ్చెను. ఆ ప్రభావమ్మున తన సవతి తల్లి ఇంట సంపదలు క్రమముగా వృద్ధి చెందసాగెను.

అటుపిమ్మట, ప్రతి సంవత్సరము వచ్చు మార్గశిర మాసమున అయిదు లక్ష్మివారములు నియమ నిష్ఠలతో శ్రీమహాలక్ష్మి పూజచేసి, తమ విభవము కొలది పరమాన్నము, పులగము, బూరెలు, అప్పాలు మొదలగువాటిని నివేదనము చేయుచూ వారిరువురి కుటుంబములు సుఖసంపదలతో ఆనందముగనుండిరి.


గమనిక: పైన ఇవ్వబడిన వ్రతకథ, ఈ పుస్తకములో కూడా ఉన్నది.

శ్రీ లక్ష్మీ స్తోత్రనిధి

(నిత్య పారాయణ గ్రంథము)

Click here to buy


మరిన్ని వ్రతములు చూడండి.


గమనిక (15-May) : "శ్రీ దక్షిణామూర్తి స్తోత్రనిధి" ప్రింటింగు పూర్తి అయినది. కొనుగోలు చేయుటకు ఈ లింకు క్లిక్ చేయండి - Click here to buy.

పైరసీ ప్రకటన : శ్రీఆదిపూడి వెంకటశివసాయిరామ్ గారు మరియు నాగేంద్రాస్ న్యూ గొల్లపూడి వీరాస్వామి సన్ కలిసి స్తోత్రనిధి పుస్తకాలను ఉన్నది ఉన్నట్టు కాపీచేసి, పేరు మార్చి అమ్ముతున్నారు. దయచేసి గమనించగలరు.

Did you see any mistake/variation in the content above? Click here to report mistakes and corrections in Stotranidhi content.

Facebook Comments